పాపం విజయసాయి.. కార్ల ర్యాలీకి కార్యకర్తలే లేని దుస్థితి! | vijayasai flop show| nellore| ycp| mp| candidate| cadre| avoid| car
posted on Mar 7, 2024 9:20AM
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి పది రోజుల సమయం కూడా లేని తరుణంలో రాజకీయ పార్టీలు వ్యూహాలు, ఎత్తుగడలతో ఎన్నికలలో విజయం లక్ష్యంగా తమ తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికలకు సమాయత్తం అయ్యే విషయంలో ఒక వెసులు బాటు ఉంటుంది. షెడ్యూల్ విడుదలవ్వడానికి ముందే.. కొత్త పథకాల ప్రకటన, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఇలా ప్రజలకు చేరువకావడానికి చేయాల్సినదంతా చేసే అవకాశం ఉంటుంది. ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు దేశమంతా సుడిగాలి పర్యటేనలు చేస్తూ లక్షల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలూ చేసేస్తున్నారు. పనిలో పనిగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలతో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని కూడా మోగించేశారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ మాత్రం గత ఐదేళ్లలో చేసిందేమిటో చెప్పుకోలేక, జనంలోకి వెళ్లలేక సతమతమౌతోంది. అంతేనా అధికారంలో ఉండి కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో క్లారిటీ లేక మల్లగుల్లాలు పడుతోంది. గెలుపు గుర్రాలు కాదంటూ సిట్టింగులను మార్చేస్తూ జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తోంది. మళ్లీ ఆ మార్పులను మార్చేస్తూ అసలు వచ్చే ఎన్నికలలో ఏ నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలో తెలియని అయోమయంలో ఉంది. పార్టీ పరాజయాన్ని ముందుగానే ఊహించేసి పలువురు సిట్టింగులు పక్క పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. వలసలను ఆపలేక, సొంత పార్టీ శ్రేణుల విశ్వసనీయతను పొందలేక వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో గెలుపు వ్యూహాల పేరిట చేస్తున్న కసరత్తులు సర్కస్ ను తలపిస్తున్నాయి.
ఇప్పటి వరకూ పదికి ఒకటి తక్కువగా తొమ్మిది జాబితాలు విడుదల చేసి కూడా వంద మంది అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయిన జగన్.. శ్రేణుల్లో పార్టీని మళ్లీ మరొక సారి అధికారంలోకి తీసుకురాగలరన్న నమ్మకాన్ని కోల్పోయారు. పార్టీ అభ్యర్థులను గెలిపించగలనన్న ధీమా లేని వ్యక్తి పార్టీ నేతగా ఎందుకన్న ప్రశ్న పార్టీ కార్యకర్తల నుంచే వస్తోందంటే జగన్ పరిస్థితి ఏమిటో ఉహించవచ్చు.
ఇక గత ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో జగన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఐదేళ్లు గిర్రున తిరిగాయో లేదో అక్కడ ఈ సారి ఎన్నికలలో గతంతో వచ్చిన ఫలితం రివర్స్ అవుతుందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. అలాగే జగన్ అడ్డాగా చెప్పుకునే కడప జిల్లాలో కూడా పార్టీ పరిస్థితి ఎదురీతగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలలో కూడా పార్టీ గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇలాంటి తరుణంలో జగన్ వ్యూహాత్మకంగా ఇప్పటి వరకూ ప్రత్యక్ష ఎన్నికలతో సంబంధం లేకుండా పదేళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా చక్రం తిప్పుతున్న పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీగా రంగంలోకి దింపారు. ఆయన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో పార్టీ ప్రభ మళ్లీ వెలుగుతుందని ఆశించారు. కానీ ఆ ఆశ మొగ్గలోనే వాడిపోయిందని పరిశీలకులు అంటున్నారు. నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా ఖరారైన తరువాత విజయసాయి రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఉలవపాడు నుంచి ఈ ర్యాలీని ప్రారంభించేందుకు పక్కా ప్రణాళిక కూడా రచించారు. అయితే 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించాలని తలచిన ఆయనకు పార్టీ క్యాడర్ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో కంగుతిన్నారు. కారుకు కనీసం ఒకరిద్దరు కూడా ఉండే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికలలో నిలబడితే ఆయన ఫేట్ ఏమిటో అభ్యర్థిగా ఖరారైన రోజే తేలిపోయింది. దీంతో భారీ ర్యాలీని విరమించుకుని సాదాసీదాగా నియోజకవర్గంలోకి ప్రవేశించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీలక నేత పరిస్థితే ఇలా ఉంటే.. మిగిలిన నియోజకవర్గాలలో అభ్యర్థుల పరిస్థితి ఏమిటన్నది ఊహకు అందనిదేమీ కాదని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి సభలకే డబ్బులిచ్చి, మద్యం పోసి మరీ జనాలను తరలించాల్సిన పరిస్థితి ఉందనీ, క్యాడర్ కూడా ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదనీ వైసీపీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే.. ఎన్నికలలో విజయం సంగతి తరువాత ముందు అభ్యర్థుల దొరుకుతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు.