
ఉంచేద్దామా? మూసేద్దామా? సూటిగా, సుత్తిలేకుండా చెప్పండి. ఆఫీస్‌లకు అద్దె కూడా కట్టకుండా మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారు? క్లారిటీ ప్లీజ్… ఇదీ బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతల ఆవేదన. ఆ ఆవేదనతోనే కేసీఆర్ మీదికి లేఖాస్త్రాన్ని సంధించారా లీడర్స్. ఇంతకీ ఆ లేఖలో ఏముంది? మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఉన్నట్టా? లేనట్టా? ఆఫీస్ బిల్డింగ్‌లకు అద్దె కట్టడం లేదు, మా ఫోన్లు ఎత్తడం లేదు. సంబంధమే లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. మేం పార్టీలో ఉన్నట్టా? లేనట్టా? అసలు మా రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఉంచుతున్నారా? పీకుతున్నారా? క్లారిటీ ఇచ్చేస్తే మా దారి మేం చూసుకుంటాం. ఇదీ మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతల మనోగతం. ఆ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖ రాశారు అక్కడి నాయకులు. తమ రాష్ట్రంలోని పార్టీ ఆఫీస్‌లకు అద్దెలు కట్టడం లేదని, కాల్ చేస్తే ఫోన్లు కూడా ఎత్తడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలన్నా డబ్బులేక ఇబ్బందులు పడుతున్నామని, నిధులు నిలిపివేయడమంటే… ఇక్కడ పార్టీని ఏం చేయదల్చుకున్నారంటూ ఘాటుగానే ప్రశ్నిస్తున్నారట మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశమంతటా విస్తరించే క్రమంలో ముందుగా మహారాష్ట్రలోనే అడుగుపెట్టారు కేసీఆర్. 2023 మేలో అక్కడ సభ్యత్వ నమోదు మొదలైంది. 15మంది నాయకులతో కమిటీ కూడా ఏర్పాటైంది. అదే ఏడాది జూన్‌లో నాగపూర్‌లో స్వయంగా పార్టీ ఆఫీస్‌ని అట్టహాసంగా ప్రారంభించారు కేసీఆర్.
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తామని చెప్పడంతో కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి పలువురు నాయకులు నాడు బీఆర్ఎస్లో చేరారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా మూడు సార్లు మహారాష్ట్ర టూర్స్ వేశారు. నాందేడ్, కాంధార్, ఔరంగాబాద్‌లో బహిరంగసభలు జరిగాయి. దీంతో రాష్ట్రంలో కొత్త పార్టీ, మనకు సరికొత్త అవకాశాలు అనుకుని సంబరపడ్డారట మరాఠా లీడర్స్. కానీ… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫేట్ తిరగబడిపోయింది. రాష్ట్రంలో బీఆర్ఎస్కు పవర్ పోవడంతో ముందు ఇంట గెలిచే కార్యక్రమంపై పార్టీ అధిష్టానం దృష్టిపెట్టిందన్నది తెలంగాణ భవన్ వర్గాల సమాచారం. ఆ క్రమంలోనే విస్తరణ కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే టైంలో మరాఠా నేతల లేఖలు కలకలం రేపుతున్నాయి. కనీసం పార్టీ ఆఫీస్‌ల అద్దెలు కట్టకుండా, నిర్వహణ ఖర్చులకు డబ్బు ఇవ్వకుండా మా రాజకీయ భవిష్యత్‌ని ఏం చేద్దామనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట అక్కడి నాయకులు. నాడు ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ లు పార్టీలో చేరారు. తాజాగా పార్టీ నియమించిన ఆరుగురు కోర్దినేటర్లు సమావేశమై అధ్యక్షుడికి లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా అల్టిమేటమ్ ఇచ్చారు. బీఆర్ఎస్లో చేరి తాము తమ రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోయామని, ఇప్పటికైనా ఏదో ఒకటి తేల్చేస్తే మా దారి మేం చూసుకుంటామని ఆవేదనగా అంటున్నారట సదరు లీడర్స్. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తుందా? లేదా? ఒక్క ముక్కలో సూటిగా, సుత్తిలేకుండా చెప్పేయాలన్నది వారి డిమాండ్‌గా తెలిసింది. అదే సమయంలో ఆఫీసుల అద్దె బకాయిల సంగతేంటో తేల్చేయమని కూడా గట్టిగానే అడుగుతున్నట్టు తెలిసింది. నమ్మి పార్టీలో చేరితే నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహారాష్ట్ర నేతలకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు? వ్యవహారాన్ని ఎలా సెటిల్ చేస్తారోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.