రాయలసీమ అభివృద్ధి ముద్ర చంద్రబాబుదే.. జగన్‌కు ఈ సారి షాక్ షూర్! | rayalaseema developement only in cbn rule| jagan| traitor| people| support| tdp| shock
posted on Mar 8, 2024 8:18AM
రాయలసీమ.. ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ప్రాంతం నుంచి గొప్పగొప్ప రాజకీయ నాయకులు ఉద్భవించారు. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన నేత. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి చెందిన నేతే. రాష్ట్రం విడిపోయిన తరువాత తొలి ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా కొనసాగగా.. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎంగా కొనసాగుతున్నారు. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఏపీలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి ఎవరి హయాంలో మేలు జరిగిందన్న చర్చ తెరపైకి వచ్చింది. అయితే, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో రాయలసీమ ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కడప బిడ్డను అని చెప్పుకోవటం తప్ప రాయలసీమ ప్రాంతానికి చేసిన మేలు లేదని అంటున్నారు. సీమకు జగన్ చేసిన అభివృద్ధి పెద్దగా ఏమీలేదని, ఆయన సీమ ద్రోహి అంటూ ఆ ప్రాంతంలోని మెజార్టీ ప్రజలు గట్టిగా చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపై జగన్ చూపుతున్న అంతులేని నిర్లక్ష్యం సీమ పాలిట పెనుశాపంగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల సమయంలో రాయలసీమ ప్రాంతంలో మొత్తం 52 సీట్లకుగాను 22 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు నియోజకవర్గాల్లోనే తెలుగుదేశం గెలిచింది. ఇందుకు ప్రధాన కారణం ఉంది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారు. కానీ, ఆ ప్రాంతం ప్రజలు అవేమీ చూడలేదు.. కేవలం మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య ఉదంతాన్నే పరిగణిలోకి తీసుకున్నారు. జగన్ కుటుంబీకులే ఈ హత్యలో నిందితులుగా ఉన్నట్లు ఆ తరువాత దర్యాప్తులో తేలుతున్నప్పటికీ 2019 ఎన్నికల సమయంలో వివేకా హత్య వెనుక చంద్రబాబు ప్రమేయం అన్న ఆరోపణలను జగన్ అండ్ కో బలంగా చేయడంతో రాయలసీమ ప్రాంతం ప్రజలు వైసీపీ వైపు మొగ్గారు. కొద్దికాలంగా వివేకా హత్య కేసులో అసలు నిజాలు బయటకు వస్తుండటంతో పాటు, ఐదేళ్ల కాలంలో జగన్ కక్షపూరిత పాలనను చూసి రాయలసీమ ప్రాంత ప్రజలు ఇప్పుడు జగన్ ను చీదరించుకుంటున్నారు. 2019లో వైసీపీకి ఓటువేసి తప్పుచేశాం.. చంద్రబాబు హయాంలోనే మా ప్రాంతానికి ఎంతో అభివృద్ధి జరిగిందని గుర్తు చేసుకుంటున్నారు. 2024లో తెలుగుదేశం పార్టీకి పట్టంకట్టేందుకు సిద్ధమవుతున్నారు.
2014 – 2019 వరకు చంద్రబాబు హయాంలో రాయలసీమ ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగింది. జల ప్రాజెక్టుల విషయానికి వస్తే.. తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో సీమ ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చుపెడితే, వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.2011 కోట్లే ఖర్చు చేసింది. దీనికి తోడు రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు హయాంలో సెల్కాన్, కియా వంటి పరిశ్రమలు వచ్చాయి. బాబు హయాంలో కేంద్ర సంస్థలు రాష్ట్రానికి పది వస్తే అందులో నాలుగు రాయలసీమకు కేటాయించారు. అందులో ఐఐటీ తిరుపతి (చిత్తూరు జిల్లా), ఐఐఎస్ఈఆర్ తిరుపతి (చిత్తూరు జిల్లా), సెంట్రల్ యూనివర్శిటీ (అనంతపురం జిల్లా), ఐఐఐటీ (కర్నూలు జిల్లా) ఉన్నాయి. అంతేకాక అనంతపురం, తిరుపతిలో రెండు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు రాయలసీమ అంటే కరువు ప్రాంతంగా గుర్తుకొస్తుంది. కానీ, చంద్రబాబు హయాంలో రాయలసీమలో నీటి సమస్యను అధిగమించేందుకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రైతులకు అధిక ప్రోత్సాహం అందించారు. అంతేకాదు.. రెయిన్‌గన్‌తో పంటకు నీరు అందించే టెక్నాలజీని తీసుకొచ్చి రైతులకు మేలుజరిగే విధంగా చంద్రబాబు కృషి చేశారు. మరోవైపు రాయలసీమలో ముఖ్యమైన కడప- కర్నూలు, కడప – విజయవాడ రైలు మార్గం చుట్టు తిరిగి అంటే డోన్ మీదుగా వెళ్ళే పరిస్థితిని తొలగించి.. బనగానపల్లె మీదుగా కర్నూలు – నంద్యాల – గిద్దలూరు మీదుగా విజయవాడ మార్గం నిర్మించి దూరం తగ్గించారు.
జగన్మోహన్‌రెడ్డి ప్రస్తుత ఐదేళ్ల పాలనలో సీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయి. అత్యంత ప్రాధాన్య రంగ మైన సాగునీటి రంగం చతికిలబడింది. తెలుగుదేశం హయాంలో చంద్రబాబునాయుడు హంద్రీ నీవా కాలువ సామర్థ్యాన్ని 3,600 క్యూసెక్కులకు విస్త రించాలని, నిర్మాణ పనులకోసం రూ.1050 కోట్లు కేటాయించి, రూ.288కోట్లు ఖర్చుచేశారు. 35శాతం పైగా పనులు పూర్తయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల్ని జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే నిలిపేశారు. మాయ మాటలతో ఇప్పటివరకు సీమ వాసుల్ని మోసగిస్తూనే ఉన్నారు. అనంతపురం జిల్లాలో 50 వేల ఎకరాలకు బిందుసేద్యం కింద సాగునీరు అందించే ఉరవకొండ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, రూ.960 కోట్లతో చేపట్టిన కల్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు నీళ్లిచ్చే జీడిపల్లి-భైరవాని తిప్ప ప్రాజెక్ట్, రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టిన జీడిపల్లి-పేరూరు ప్రాజెక్ట్, మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులు, ఇలా తెలుగుదేశం హయాంలో జరిగిన పనులు తప్ప, వైసీపీ ప్రభుత్వం వచ్చాకా సీమలో ఎక్కడా ఒక్క ప్రాజెక్టులో ఒక్క శాతం పనికూడా జర గలేదు. ఒకవేళ జరిగి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని రాయలసీమ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రాయలసీమ ప్రాంత ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే జగన్మోహన్ రెడ్డి చూశాడు తప్ప.. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. దీనికితోడు చంద్రబాబు హయాంలో రాయలసీమ ప్రాంతానికి తీసుకొచ్చిన కంపెనీలను సైతం అక్కడి నుంచి తరిమేసిన ఘనత జగన్ రెడ్డిది. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంకు మద్దతుగా నిలిచి జగన్ మోహన్ రెడ్డికి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పేందుకు రాయలసీమ ప్రాంత ప్రజలు సన్నద్ధమవుతున్నారు.