Leading News Portal in Telugu

ముద్ర‌గ‌డకు పవన్ ఫోబియా.. అందుకే వైసీపీలోకి? | mudragada pawan fobia| kapu| leader| existence| fear| jagan| covert| people


posted on Mar 8, 2024 8:46AM

కాపు నేత‌గా చ‌లామ‌ణి అవుతున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంకు భ‌యం ప‌ట్టుకుందా?  ప‌వ‌న్ బ‌లోపేతం అయితే త‌న నాయ‌క‌త్వానికి ఎసరు వస్తుందన్న ఆందోళ‌న‌లో ఉన్నారా? అందుకే వైసీపీలో చేరి  ఉనికి కాపాడుకోవాలని తాపత్రేయపడుతున్నారా?  అంటే అవున‌నే స‌మాధానం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఏపీలో మెజార్టీ కాపులు ముద్ర‌గ‌డ‌ను త‌మ సామాజిక వ‌ర్గం పెద్ద‌గా భావించేవారు. ఆయ‌న నిర్ణ‌యాల‌ను గుడ్డిగా ఫాలోఅయ్యేవారు. ఈ క్ర‌మంలోనే అనేక మంది కాపు యువకులపై కేసులు కూడా న‌మోద‌య్యాయి.  అనేక మంది  జైళ్ల‌కు  వెళ్లిన సంద‌ర్భాలున్నాయి. అయితే అలాంటి గుడ్డి నమ్మకం ఎల్లకాలం ఉండదని ఇటీవలి పరిణామాలు రుజువు చేశాయి. పోనీ ఇంత కాలం కాపు పెద్దగా చెలామణీ అవుతూ వచ్చిన ముద్రగడ  కాపు సామాజిక‌వ‌ర్గానికి  చేసిన మేలు ఏమైనా ఉందా అంటూ లేద‌నే  కాపు యువత ఇప్పుడు గట్టిగా చెబుతోంది. కాపు రిజ‌ర్వేష‌న్లు, కాపు నేత‌ను సీఎంగా చూడాల‌న్న ఆ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌లు అందుకోసం కంకణం కట్టుకున్నానని చెప్పుకున్న ముద్రగడ వంటి వారిని నమ్మారు. అందుకే వారు ఏం చెబితే అది గుడ్డిగా చేశారు. అయినా వారి ఆశ‌లు మాత్రం నెర‌వేర‌  లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ముద్ర‌గ‌డ లాంటివారేన‌న్న అభిప్రాయం ఆ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి ఇప్పుడు బలంగా వ్య‌క్త‌మ‌వుతోంది. మేమే సామాజిక వ‌ర్గానికి పెద్ద‌లుగా ఉండాలి.  ఎన్నిక‌ల స‌మ‌యంలో మేం ఏ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిస్తే కాపులంద‌రూ ఆ పార్టీ అభ్య‌ర్థుల‌కే ఓట్లు వేయాల‌నే భావ‌న కార‌ణంగా ఏపీలో కాపులు ఇంకా కాపుకాసే వారిగానే మిగిలిపోతున్నార‌న్న చ‌ర్చ‌సైతం ఆ సామాజిక వ‌ర్గ ప్ర‌జ‌ల్లో జరుగుతోంది.

పాము త‌న పిల్ల‌ల‌ను తానే తింటుంద‌న్న సామెత ముద్ర‌గ‌డ వ్య‌వ‌హారంలో నిరూపిత‌మ‌వుతోంద‌ని రాజకీయ సర్కిల్స్ చర్చ జరుగుతోంది. ఏపీ రాజ‌కీయాల్లో కాపు నేతను సీఎంగా చూడాల‌న్న‌ది ఆ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌ల కోరిక‌. గ‌తంలో చిరంజీవి ఆ ప్ర‌య‌త్నంలో ఓట‌మి పాలయ్యారు. ఆ స‌మ‌యంలో కాపు సామాజిక వర్గంలోని కొంద‌రు నేత‌లే  ఆయ‌న ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్న ప్ర‌చారం  జ‌రిగింది. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అంచెలంచెలుగా రాజ‌కీయాల్లో ఎదుగుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీచేసిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ .. పార్టీని న‌డుపుతూ ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గా కొన‌సాగుతున్నారు. రాబోయే కాలంలో జ‌న‌సేన పార్టీని గ్రామ‌స్థాయి నుంచి బ‌లోపేతంచేయాల‌నేది ప‌వ‌న్ ఆలోచ‌న‌. ఆ దిశగా ఆయ‌న అడుగులు పడుతున్నాయి. గ్రామ‌ స్థాయిలో పార్టీకి పునాదులు లేకుండా సీఎం కుర్చీ కావాలంటే అది అత్యాశే అవుతుంది. ఈ విష‌యం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు బాగా తెలుసు. అందుకే ఆయ‌న ఒక్కో అడుగు ముందుకువేస్తూ పార్టీ బ‌లాన్ని పెంచుకుంటున్నారు.  

తాజాగా టీడీపీతో పొత్తుతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీసం 20మందికి త‌గ్గ‌కుండా జ‌న‌సేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టాల‌న్న‌ది ప‌వ‌న్ ఆలోచ‌న‌. దీనికితోడు.. ఏపీలో అభివృద్ధి మ‌రిచి, క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో పాల‌న సాగిస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని గ‌ద్దెదించేందుకు ప‌వ‌న్  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మ‌రోవైపు  ప‌వ‌న్ దూకుడుకు కాపు సామాజిక వ‌ర్గం నేత‌ల‌తోనే అడ్డుక‌ట్ట వేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. జ‌గ‌న్ వ్యూహాల‌కు అనుగుణంగా కాపు సామాజిక వ‌ర్గం పెద్ద‌గా పేరున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అడుగులు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటికి వైసీపీ ఎంపీ, ఉభ‌య గోదావ‌రి జిల్లాల పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ మిథున్ రెడ్డి  వెళ్లి ఆయ‌న్ను వైసీపీలోకి ఆహ్వానించారు. ముద్ర‌గ‌డ సైతం వైసీపీలోకి చేరేందుకు సిద్ధ‌మ‌యిన‌ట్లు స‌మాచారం. దీంతో ముద్ర‌గ‌డ‌కు వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓ టాస్క్ సిద్ధం చేశారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌ర‌పున‌ ప్ర‌చారం చేయాల‌ని జగన్ ముద్రగడను ఆదేశించినట్లు చెబుతున్నారు.   అందుకు ముద్ర‌గ‌డ‌ ఓకే అన్నారని కూడా చెబుతున్నారు.  దీంతో..  కాపు సామాజిక వ‌ర్గానికి పెద్ద‌గా తనను తాను ప్రకటించుకున్న ముద్ర‌గ‌డ‌తోనే కాపు సామాజిక వ‌ర్గంలో బలమైన నేతగా ఎదుగుతున్న  ప‌వ‌న్ క‌ల్యాణ్ కు చెక్ పెట్టేలా జ‌గ‌న్ వ్యూహం సిద్ధం చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

వ‌చ్చేఎన్నిక‌ల్లో తెలుగుదేశం, జ‌న‌సేన  పొత్తులో భాగంగా జ‌న‌సేన పార్టీ 24 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, మూడు పార్ల‌మెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణ‌యించింది. ముద్ర‌గ‌డ‌, హ‌రిరామ జోగ‌య్య లాంటివారు కాపు సామాజిక‌వ‌ర్గం పెద్ద‌లు మాట్లాడుతూ.. కేవ‌లం 24 సీట్లేనా? 50 నుంచి 60 సీట్లు తీసుకోవాలి.. 24 స్థానాల కోసమే అయితే తెలుగుదేశంతో  పొత్తు ఎందుకు అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ప్ర‌శ్నించారు. అంతేకాదు.. వైసీపీ నేత‌ల‌తో క‌లిసి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. ముద్ర‌గ‌డ లాంటి నేత‌లు వైసీపీ కోవ‌ర్టులుగా ప‌నిచేస్తున్నార‌ని గుర్తించిన ప‌వ‌న్.  బ‌హిరంగ స‌భ వేదిక‌పైనే వారికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. దీంతో ముద్ర‌గ‌డ వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. వైసీపీలో చేరి కాపులంద‌రినీ వైసీపీ వైపుకు మ‌ళ్లించి ప‌వ‌న్ తో పాటు జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థుల‌ను ఓడించ‌డ‌మే ముద్ర‌గ‌డ టార్గెట్ గా పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. ఈ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ తోపాటు జ‌న‌సేన అభ్య‌ర్థులు అత్య‌ధిక  స్థానాల్లో ఓడిపోతే.. కాపు ఉద్య‌మ నేత‌గా, కాపు సామాజిక‌వ‌ర్గానికి పెద్ద‌గా త‌న మున‌గ‌డ‌కు ఎలాంటి ప్ర‌మాదం  ఉండ‌ద‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం భావిస్తున్నార‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా సాగుతుంది. 

అయితే, ముద్ర‌గ‌డ ఎత్తుగ‌డ‌ను కాపుల్లోని మెజార్టీ ప్ర‌జ‌లు గుర్తించార‌ని, ఈసారి ముద్ర‌గ‌డ‌కు గుణ‌పాఠం చెప్పి.. ప‌వ‌న్ కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు కాపు సామాజిక వ‌ర్గం  నిర్ణయించుకున్నట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తానికి కాపు సామాజిక వ‌ర్గం పెద్దగా.. అదే సామాజిక వ‌ర్గానికి చెందిన‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఓడించే ప్ర‌య‌త్నంలో ముద్ర‌గ‌డ ఘోరంగా విఫలం అవుతారని అందులో అనుమానమే లేదనీ అంటున్నారు.