కవిత అడుగులు ఎటు.. పార్టీకి దూరంగా.. జనాలకు దగ్గరగా.. వ్యూహం ఏంటి? | kavita keep distance from brs| kalvakuntla| family| active| jagruti| liquor| scam| face| without| brs| kcr
posted on Mar 8, 2024 1:22PM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ, ఎమ్మెల్సీ కవిత తన దారి తాను చూసుకుంటున్నారా? రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తనకు అండగా నిలిచే పరిస్థితిలో లేదని భావిస్తున్నారా? ఒక వేళ ఈ కేసులో తాను అరెస్టయ్యే పరిస్థితి ఏర్పడితే కనీసం రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలకు దిగే ధైర్యం కూడా చేయలేదని భావిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అందుకే ఆమె పార్టీ కార్యక్రమాలలో పెద్దగా కనిపించడం లేదు. పెద్దగా అనేమీ కాదు అసలు పార్టీ వ్యవహారాలలో ఆమె కలగజేసుకోవడం లేదు. పార్టీ పరంగా ఇచ్చిన కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. అలాగని ఆమె పూర్తిగా ఇంటికే పరిమితమైపోయి అజ్ణాతంలోకి వెళ్లిపోయారా అంటే లేదు. ఎన్నికల ఫలితాల తరువాత ఒక రకంగా చెప్పాలంటే ఆమె యాక్టివ్ అయ్యారు. అయితే ఆమె యాక్టివిటీ అంతా పార్టీతో సంబంధం లేకుండా జరుగుతోంది.
తాను బీఆర్ఎస్ కూ దూరం అవుతున్నానన్న సంకేతాలు ఇస్తున్నారు. అంటే ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు ఇస్తున్నట్లుగా పార్టీ మారుతున్నాన్న సంకేతాలు కాదు, ఆమె తన కంటే ప్రత్యేక గుర్తింపును కోరుకుంటూ.. ఆ దారిలో బిజీ అవుతున్నారని తెలిసేలా కవిత వ్యవహారశైలి ఉంది. మహిళారిజర్వేషన్లపై జీవో నంబర్ 3పై ఆమె శుక్రవారం (మార్చి 8 ) ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో జాగృతి పేర ఆమె పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆదే జాగృతి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అంతే కాదు.. తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైన తరువాత ఆమె పార్టీకి దూరంగా ఉన్నా రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వంపై విమర్శల విషయంలో మాత్రం వెనక్కు తగ్గలేదు.
అయితే బీఆర్ఎస్ కార్యక్రమాలలో ఆమె ఏ మాత్రం భాగం కాకుండా దూరంగా ఉండటమే పరిశీలకులను సైతం విస్మయ పరుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విమర్శల నేపథ్యంలో బీఆర్ఎస్ పిలుపు మేరకు జరిగిన చలో మేడిగడ్డ కార్యక్రమానికీ, అలాగే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 6(బుధవారం) బీఆర్ఎస్ నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలోనూ కవిత పాల్గొనలేదు. అయితే ఆమె చినజీయర్ స్వామితో భేటీ కావడంతో ఆమె అడుగులు ఎటువైపు అన్న అనుమానాలకు తావిచ్చాయి.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితపై ఆరోపణలు బయటకు వచ్చిన నాటి నుంచీ కూడా బీఆర్ఎస్ లో ఆమె స్థానం, బీఆర్ఎస్ తో ఆమె ప్రయాణం గతంలోలా లేదని మాత్రం పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి సారి కవితకు మద్యం కుంభకోణంలో ఢిల్లీ వచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందిన సమయంలో ఆమెను బీఆర్ఎస్ మాత్రమే కాదు కల్వకుంట్ల ఫ్యామిలీ సైతం పక్కన పెట్టేసిందా అనేలా అప్పటి పరిణామాలు ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం మచ్చ ఇటు పార్టీకి, అటు కుటుంబానికి అంటకుండా ఉండేందుకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి నంతవరకు కల్వకుంట్ల కవితతో పార్టీ పరంగా లేదా కుటుంబ పరంగా ప్రత్యక్ష సంబంధాలు లేకుండా జాగ్రత్త వహించారా అన్న అనుమానాలు అప్పట్లో పరిశీలకుల నుంచి వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే అప్పట్లో ఆమె తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత పేరు అప్పట్లో ప్రముఖంగా వినిపించినా, కేసీఆర్, కేటీఆర్ సహా కల్వకుట్ల కుటుంబ సభ్యులు ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇక పార్టీ పరంగా కూడా మొదట్లో పెద్దగా ఆమెకు మద్దతు లభించలేదు. అయితే ఇలా ఆమెను దూరం చేయడం ప్రజలలో తప్పుడు సంకేతాలు ఇస్తుందని భావించిన ముఖ్యమంత్రి పార్టీ నేతలతో పాటుగా, న్యాయవాదులతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర గురించి, ఆ కేసులోంచి ఆమె బయటపడే మార్గాల గురించి చర్చించారు. ఆ తరువాత కవితకు మద్దతుగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అప్పటి మంత్రి హరీష్ రావులు ఆమెతో పాటు హస్తినకు వెళ్లారు. పార్టీ నేతలూ, శ్రేణులూ కూడా కవితకు మద్దతుగా మీడియా సమావేశాలు నిర్వహించారు. ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ భయానికే మోడీ కేసీఆర్ ను కట్టిడి చేసేందుకు కవితను టార్గెట్ చేశారని విమర్శలూ గుప్పించారు.
పార్టీలో , కుటుంబంలో తొలత మద్యం కుంభకోణంలో తనకు మద్దతు లేని పరిస్థితులు ఉన్న సమయంలో కవిత పూర్తిగా తెలంగాణ జాగృతినే నమ్ముకున్నారు. ప్రెస్ మీట్లలో కూడా అదే విషయాన్ని పదే పదే చెప్పేవారు. ఆ తరువాత పరిస్థితి మారిందనుకోండి అది వేరే సంగతి. అప్పట్లో పార్టీ, కల్వకుంట్ల కుటుంబం కవితను వద్దనుకుంటే.. ఇప్పుడు కవిత బీఆర్ఎస్, కల్వకుంట్ల అండ తనకు అవసరం లేదని భావిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనపై ఆరోపణలు, కేసుల విషయంలో పార్టీ, కల్వకుంట్ల కుటుంబం అండ అవసరం లేకుండానే ఎదుర్కొని, పోరాడాలని కవిత భావిస్తున్నారా? లేక రాజకీయంగా ఆమె అడుగులు మరో దారికి మళ్లాయా అన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కవిత వ్యవహార శైలి మాత్రం రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.