
లోక్ సభ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది. ఈరోజు.. 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. తెలంగాణలో 9 మందితో మొదటి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కింద సూచించిన అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.
మహబూబ్ నగర్- వంశీచంద్ రెడ్డి
చేవెళ్ల- సునీతా మహేందర్ రెడ్డి
నల్గొండ- రఘువీర్ రెడ్డి
సికింద్రాబాద్- బొంతు రామ్మోహన్
నిజామాబాద్- జీవన్ రెడ్డి
కరీంనగర్- ప్రవీణ్ రెడ్డి
పెద్దపల్లి- గడ్డం వంశీ
జహీరాబాద్- సురేష్ షెట్కార్
మెదక్- నీలం మధు
నిన్న ఢిల్లీలోని అక్బర్ రోడ్లో గల ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ముఖ్యనేతలు జైరాం రమేశ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధిర్ రంజన్ చౌదరి, అంబికా సోని, ముకుల్ వాస్నిక్, టీఎస్ సింగ్ డియో సహా సీఈసీ సభ్యులు పాల్గొన్నారు. వర్చువల్గా రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ, కర్నాటక, కేరళ, ఛత్తీస్గఢ్, హర్యానా, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై వేర్వేరుగా చర్చించారు.