Leading News Portal in Telugu

Bengaluru Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుడి కొత్త ఫోటోలను రిలీజ్ చేసిన ఎన్ఐఏ..



Nia

Bengaluru Cafe Blast: బెంగళూర్‌లో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు నిందితుడి కొత్త ఫోటోలను కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విడుదల చేసింది. మార్చి 3న కేసును స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ, నిందితుడిని గుర్తించేందు ప్రజల సాయాన్ని కోరింది. మార్చి 1న బెంగళూర్‌లోని ఐటీ కారిడార్‌లోని కేఫ్‌లో నిందితుడు బ్యాగుల్లో ఐఈడీ బాంబును ఉంచి, టైమర్ సాయంతో పేల్చాడు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. పేలుడు తర్వాత నిందితుడు బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. పేలుడు మధ్యాహ్నం 12.56 గంటలకు జరిగితే, టీ షర్ట్, క్యాప్, ఫేస్ మాస్క్ ధరించిన వ్యక్తిని 2.03 గంటలకు బస్‌లోని సీసీటీవీ క్యాప్చర్ చేసింది. అదే రోజు రాత్రి 9 గంటలకు మరో ఫుటేజీలో అనుమానితుడు బస్ స్టేషన్‌లో తిరుగుతున్న వీడియోను ఎన్ఐఏ విడుదల చేసింది.

Read Also: Maldives: భారతీయులకు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు క్షమాపణ

ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు ప్రజల సాయాన్ని కోరిన ఎన్ఐఏ, ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డును ప్రకటించింది. బెంగళూర్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో ఎన్ఐఏకి సహకరిస్తోంది. ఈ కేసులో బళ్లారికి చెందిన ఓ బట్టల వ్యాపారిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఇతను నిషేధిత పీఎఫ్ఐ సంస్థ క్రియాశీలయ సభ్యుడిగా ఉన్నాడు. ఈ కేసుతో ఇతనికి సంబంధం ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. నిందితుడు సంఘటన తర్వాత బట్టలు మార్చుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తుమకూరు, బళ్లారి, బీదర్, భత్కల్‌తో సహా వివిధ ప్రాంతాలకు బస్సులో ప్రయాణించినట్లు తెలుస్తోంది. తనను ఎవరూ గుర్తించకుండా రూపాన్ని మార్చినట్లు సీసీటీవీ ఫుటేజీలతో తేలింది. మరోవైపు దాడికి గురైన రామేశ్వర కేఫ్ 8 రోజుల తర్వాత మళ్లీ తెరుచుకుంది. భద్రతను పటిష్టం చేసేందుకు మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు.