Leading News Portal in Telugu

Harish Rao : కేసీఆర్ ఉండగా రాష్ట్రంలో ఏ రోజు కూడా కరెంట్ పోలేదు



Harish Rao

పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావును జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి మున్నూరు కాపు సంఘం నేతలు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. మీ వినతిని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకు వెళతాం. మీ ఆలోచనలను వివరిస్తామన్నారు. కేసీఆర్ గారు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే వ్యక్తి అని, మున్నూరు కాపు నేతలకు గతంలోనూ ఎంతో మందికి అవకాశం కల్పించారన్నారు. కేసీఆర్ ఉండగా రాష్ట్రంలో ఏ రోజు కూడా కరెంట్ పోలేదని, నిన్న ఒక ఊరుకు పోతే కరెంట్ కోతలు మొదలు అయ్యాయని రైతులు అవేదన చెందారన్నారు. పదేళ్లలో ఎలాంటి బాధ లేకుండా చూసుకున్నామని, వంద రోజుల్లో 13 హామీలు అన్నారు. 9 తారీఖు రుణమాఫీ అన్నారని, ఎన్ని 9 తేదీలు మారినా రుణమాఫీ కావడం లేదని హరీష్‌ రావు విమర్శించారు.

అంతేకాకుండా..’బోనస్ విషయంలో దగా.. రుణమాఫీ విషయంలో దగా.. ఉచిత కరెంట్ విషయంలో దగా.. రైతు బంధు విషయంలో దగా.. కాంగ్రెస్ పాలన అంటేనే దగా అన్నట్లు ఉంది. చెప్పుకుంటూ పోతే మొత్తం 420 దగాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఈ మాత్రం కరెంట్ ఇస్తున్నాయి. ఎన్నికలు అయిపోతే కరెంట్ కోతలు పూర్తి స్థాయిలో ఉంటాయి. మోడీని బడే భాయ్ అని, ఎల్లప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉండాలని రేవంత్ అన్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదు అని రేవంత్ చెప్పకనే చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలో ఉన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వచ్చేది లేదు, ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే దిగేదేమి లేదు. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బి ఆర్ ఎస్ ను గెలిపించాలి. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే బి ఆర్ ఎస్ పోరాటం తోనే సాధ్యం అవుతుంది. రుణమాఫీ, రైతు బంధు, కరెంట్, బోనస్ ఇవ్వనందుకు రైతులు ఏకమై వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలి. వంద రోజుల్లో ఆరు గ్యారెంటేలు అన్నారు. అసెంబ్లీలో చట్టం చేస్తాం అన్నారు.చేయలేదు. మన వేలితో మన కన్ను పొడుచుకోవద్దు. తప్పిపోయి కాంగ్రెస్ కు ఓటు వేయోధ్దు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి. రెండు సార్లు గేలిపిస్తే పార్టీకి మోసం చేసింది బీబీ పాటిల్. వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలి. దేశంలో కాంగ్రెస్ కు ప్రధాన ప్రతి పక్ష హోదా కూడా వచ్చే అవకాశం లేదు.’ అని హరీష్‌ రావు అన్నారు.