
Lok Sabha Election: లోక్‌సభ ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. మరో వారంలో ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారలు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దీని తర్వాత గురువారం లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ నెలలోగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈసీ అధికారులు పర్యటిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్ని కూడా ఒకేసారి నిర్వహించవచ్చో..? లేదో.. అనే విషయాన్ని అంచనా వేయాలని కేంద్రం ఈసీని కోరింది. బుధవారం పర్యటన ముగియగానే తర్వాతి రెండు రోజుల్లో ఎప్పుడైనా షెడ్యూల్ వెలువడొచ్చని తెలుస్తోంది.
Read Also: Karnataka: పాక్ మద్దతుదారుల్ని కాల్చిపారేయాలి.. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు..
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల విషయంలో భద్రతా యంత్రాంగం అన్ని వివరాలను ఈసీకి అందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్‌తో సహా మొత్తం ప్యానెల్ మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో చివరిసారిగా 2014లో ఎన్నికలు జరిగాయి. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్-లడఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు.
అయితే, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, జమ్మూకాశ్మీర్‌లో సెప్టెంబర్ నెలలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని గతేడాది డిసెంబర్లో ఆదేశించింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
మరోవైపు ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార బీజేపీ పార్టీ తన 195 మంది అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. మరోవైపు కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉంది. ఇక ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్‌పై మిత్ర పక్షాలతో చర్చిస్తోంది.