పథకాల జోరు.. రేవంత్ సర్కార్ కు కలిసొస్తున్న తీరు! | revanth government gainingg people support| six| guarantees| implement| brs
posted on Mar 11, 2024 9:35AM
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ఏ మాత్రం జాస్యం చేయడం లేదు. ఎన్నికల సమయంలో వాగ్దానం ఇచ్చిన విధంగా అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ప్రజల నమ్మకాన్ని, మన్ననలను పొందుతోంది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల అమలుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు.. రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా పరిమితిని రూ.10లక్షలకు పెంచారు. మరోవైపు రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమచేయడంతోపాటు.. ఇటీవల మహాలక్ష్మీ పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించే పథకానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. అలాగే గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ స్కీంను ప్రభుత్వం అమలు చేస్తోంది. మరోవైపు ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి తోడు వడ్డీలేని రుణాలనుసైతం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.. ఈనెల 12 నుంచి వడ్డీలేని రుణాలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేకంటే ముందే.. మహిళలకు నెలకు రూ.2500 నగదు పంపిణీ కార్యక్రమన్ని కూడా ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లో పలు పథకాలను అమలు చేస్తామని ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన మూడు నెలల కాలంలోనే దాదాపు సగానికిపైగా పథకాలు అమల్లోకి వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల సమయం నాటికి మరికొన్ని పథకాలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ ఎస్ పార్టీ నేతలు మాత్రం తొలి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమల్లో పూర్తి గా విఫమవుతుందని విమర్శిస్తూ వచ్చారు. కానీ రేవంత్ మాత్రం పట్టుదలతో ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి కాంగ్రెస్ సర్కార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే పార్టీకి ఆదరణ భారీగా పెరిగిందని పలు సర్వేలు చాటుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో.. అటు అసెంబ్లీలోనూ, ప్రభుత్వ పాలనలోనూ తనదైన మార్క్ ను చూపుతున్నారని ప్రజల ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోందని సర్వేలు చాటుతున్నాయి.
ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఈసీ సన్నద్దమవుతోంది. ఇప్పటికే తెలంగాణలోని అధికార కాంగ్రెస్ తో పాటు.. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ ఎస్, బీజేపీ అధిష్టానాలు ఎన్నికల్లో సత్తాచాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. మూడు పార్టీలూ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో 12 నుంచి 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలన్న వ్యూహంతో రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ మేరకు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ విపక్ష పార్టీలపై తనదైన శైలిలో రేవంత్ విరుచుకు పడుతున్నారు. రేవంత్ వ్యూహం ఫలిస్తోందనడానికి తాజాగా వెల్లడవుతున్న సర్వే ఫలితాలే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్నెళ్లకంటే ఎక్కువకాలం ఉండదని, కూలిపోతుందని బీఆర్ ఎస్ నేతలు పదేపదే అంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు సైతం కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోతుందని అనడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని పరిశీలకులు విశ్లేషి స్తున్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్నిఎలా కూల్చేస్తారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నా రంటున్నారు. దీనికి తోడు బీఆర్ ఎస్ పార్టీ నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతుండటంతో కేసీఆర్ తన పార్టీని కాపాడుకోవడంపై ముందు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.