ఏపీలో మద్యం కుంభకోణంపై ఈడీ నజర్.. జగన్ అరెస్ట్ ఖాయమా? | ed nazar on ap liquor scam| cash| transactions| digital| reject| jagan
posted on Mar 11, 2024 10:26AM
ఏపీలో మద్యం కుంభకోణంపై ఈడీ నజర్ పెట్టిందా..? మద్యం అమ్మకాల్లో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు సిద్ధమైందా..? సీఎం జగన్ మోహన్ రెడ్డి మెడకు మద్యం కుంభకోణం ఉచ్చు బిగుసుకోబోతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఏపీలో మద్యం విక్రయాలు, లావాదేవీలపై దృష్టిసారించిన ఈడీ.. ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఖరారు కావడంతో ఈడీ సైతం తన పని మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఏపీలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా డబ్బాకొట్టు వ్యాపారి నుంచి డిజిటల్ లావాదేవీలతో వ్యాపారం కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కానీ ఏపీలో మద్యం విక్రయాల్లో మాత్రం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలు మాకు అవసరం లేదన్నట్లుగా పక్కకు పెట్టేసింది. అధిక ప్రాంతాల్లో కేవలం క్యాష్ తోనే మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో మద్యం షాపుల్లో కేవలం క్యాష్ లావాదేవీల కారణంగా భారీఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. ప్రైవేట్ మద్యం దుకాణాలను రద్దుచేసి వాటి స్థానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. దీంతో అధికార పార్టీ కీలక నేతలు కొందరు బినామీల పేరిట మద్యం సరఫరా సంస్థలను ఏర్పాటు చేశారు. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ఈ సరఫరా సంస్థల నుంచి మద్యం కొనుగోలు చేసి దుకాణాల్లో విక్రయిస్తోంది. బెవరేజస్ కార్పొరేషన్ వద్ద వంద సంస్థలు నమోదై ఉండగా.. అనధికారికంగా నిర్దేశించిన కమీషన్ చెల్లించేందుకు అంగీకరించిన సంస్థలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తున్నట్లు ఈడీకి అనేక సార్లు ఫిర్యాదులు అందాయి. కేవలం ప్రభుత్వం పెద్దలకు సన్నిహితులు, అధికార పార్టీ నేతలకు చెందిన 16 కంపెనీలు మాత్రమే అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్నాయి. దీనికి తోడు మద్యం దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలుకాకుండా.. క్యాష్ తోనే మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అంతేకాక.. కేవలం నాలుగైదు రకాల బ్రాండ్స్ మద్యాన్ని మాత్రమే విక్రయిస్తున్నారు. దీనిపై మందు బాబులు పలు మార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదులు సైతం చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే, ఏపీలో మద్యం సరఫరా, విక్రయాలు, తదితర విషయాల్లో జరుగుతున్న అవకతవలపై ఈడీ ఎప్పటికప్పడు ఆధారాలు సేకరిస్తూనే ఉందని సమాచారం.
మద్యం దుకాణాల్లో తప్పనిసరిగా డిజిటల్ పేమెంట్స్ తీసుకోవాలి.. దీంతో లెక్కలు పక్కాగా ఉంటాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ తీసుకోకపోవడం ముమ్మాటికీ తప్పేనని పలువురు రిటైర్డ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు నిర్వహించేందుకు ఒక ప్రైవేట్ కంపెనీ యాప్ తయారు చేసింది. ఐదారు నెలలు డిజిటల్ లావాదేవీలకు మద్యం దుకాణాల్లో అనుమతించినా.. ఆ తరువాత కేవలం క్యాష్ ఇచ్చినవారికే మద్యం విక్రయిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు పక్కదారి పడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం హయాంలో 2019 నాటికి ప్రభుత్వానికి రోజుకు మద్యంపై రూ.50కోట్లు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అది రోజుకు రూ.90కోట్ల వరకు చేరుకుంది. అయితే మద్యం ధరలను ఏపీ ప్రభుత్వం గతకంటే మూడు రెట్లు పెంచేసింది. దీంతో మద్యం అమ్మకాలు కాస్త తగ్గినా ఆదాయం మాత్రం భారీగా సమకూరుతుంది. 2018-19 లో మద్యం ఆదాయం రూ. 20,128 కోట్లుగా ఉంటే.. 2022-23లో రూ. 28,113 కోట్లకు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే, క్యాష్ లావాదేవీలు మాత్రం జరుగుతుండటంతో లెక్కలు చూపకుండా డబ్బులు చేతులు మారుతోందని, దీనివల్ల జీస్టీ ఎగ్గొడుతున్నారన్న ఫిర్యాదులు ఈడీకి కుప్పలుతెప్పలుగా వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది.
ఏపీలో మద్యం విక్రయాల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని తెలుగుదేశం నేతలు కొన్నేళ్లుగా విమర్శలు చేస్తున్నారు. ఈడీకి సైతం అనేకసార్లు పిర్యాదులు సైతం చేశారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఈడీ ఏపీలో మద్యం సరఫరా, విక్రయాలు, లావాదేవీలపై పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మద్యం విక్రయాల్లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కూడా కలవడంతో ఇక పై నుంచి ఒత్తిడులు వచ్చే అవకాశం లేదన్న భావనతో ఈడీ ఏపీ మద్యం వ్యవహరంలో దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరో వారం పదిరోజుల్లో ఈడీ అధికారులు అక్రమార్కులపై కొరడా ఝుళిపించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారం సీఎం జగన్ మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోవటం ఖాయమని, ఆయన అరెస్టు తప్పదని పరిశీలకులు అంటున్నారు.