కేసీఆర్ మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. చంద్రబాబే దిక్కా! | kcr deep trouble in phone tapping| seek| cbn| help| come| out| revanth| stuburn| praneetrao| inquiry| key| information
posted on Mar 12, 2024 9:13AM
ఒకప్పుడు ఓటుకు నోటు కేసు అంటూ బీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన హడావుడి అంతాఇంతా కాదు.. అయితే ఆ కేసు ఇప్పుడు కేసీఆర్ మెడకు చుట్టుకోబోతోందా? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టు కాబోతున్నారా? అప్పట్లో చంద్రబాబును దేవుడు కూడా కాపాడలేడని చెప్పి కేసీఆర్‌కు.. ఇప్పుడు చంద్రబాబు దేవుడు కాబోతున్నాడా? అంటే అవుననే చర్చ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ఈ చర్చకు ప్రధాన కారణం ప్రణీత్ రావు వ్యవహారం. బీఆర్ ఎస్ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో పలు పార్టీల నేతలు, ఇతరుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రణీత్ రావును సస్సెండ్ అయ్యారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ప్రస్తుతం ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ విచారణలో ప్రణీత్ రావు షాకింగ్ విషయాలను వెల్లడిస్తున్నట్లు సమాచారం. ప్రణీత్ పూర్తి స్థాయిలో గుట్టువిప్పితే మాజీ సీఎం కేసీఆర్ మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు గట్టిగానే చుట్టుకునే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడానికి రాజకీయాల్లో పెద్దగా సమయం పట్టదు.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కు ఈ విషయం తెలిసినప్పటికీ.. ఆ పరిస్థితిని ప్రత్యక్షంగా ఎదుర్కోబోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఎప్పటిలాగే కొన్నిరోజులు ఈ అంశంపై హడావుడి ఉంటుంది. ఆ తరువాత ఈ వ్యవహారాన్ని ప్రజలు, ప్రభుత్వం మర్చిపోతుందని కొందరు భావించారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకొనే పరిస్థితి కనిపించడం లేదు. కేసీఆర్ తన హయాంలో ప్రతిపక్ష నేతల కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ సైతం పలుసార్లు ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రేవంత్ సీఎం అయిన తరువాత.. హోంశాఖను తనవద్దే ఉంచుకోవటానికి ప్రధాన కారణం పోలీస్ శాఖను సెట్‌రైట్ చేసే బాధ్యతను తీసుకోవాలన్న నిర్ణయంతోనే అంటున్నారు. ఆ క్రమంలోనే కేసీఆర్ కుటుంబానికి పోలీస్ శాఖపై ఉన్న పట్టును పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాపింగ్ ను వజ్రాయుధంలా వాడుకున్నారని ఆరోపణలు ఉండటంతో.. ఆ వజ్రాయుధాన్ని తిరిగి వాళ్ళ మీదకే ప్రయోగించడానికి రేవంత్ పక్కాప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు.
బీఆర్ ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి వ్యవహారంలోనే కాదు.. బీజేపీ నేతల వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ కు మాజీ సీఎం కేసీఆర్ పాల్పడినట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ హయాంలో ఫామ్ హౌస్ లో ప్రముఖ బీజేపీ నాయకులను డబ్బుతో పట్టుకొన్నామని కేసీఆర్ తెగ హంగామా చేసిన విషయం తెలిసిందే. దేశంలో అన్ని రాష్ట్రాల నాయకులకు, న్యాయమూర్తులకు లేఖలు రాసి బీజేపీ తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర చేస్తే తాను పట్టుకొన్నామని అప్పట్లో కేసీఆర్ హడావుడి చేశారు. అంతేకాదు ప్రధాని మోడీని నానా విధాలుగా దుర్భాషలాడారు. ఆ దెబ్బతో దేశ రాజకీయాల్లో సంచలనంగా మారి దేశానికే ప్రధాని అవుతానని కేసీఆర్ కలలు కన్నారు. కానీ, కేసీఆర్ ను దేశంలో ఎవ్వరూ నమ్మలేదు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి నాటినుంచి సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టి కేసీఆర్ పునాదులు కదిలిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో కేసీఆర్, బీఆర్ ఎస్ నేతలు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నారు.. రేవంత్ రెడ్డి మాత్రం చాపకింద నీరులా తన పనితాను చేసుకొంటూ పోతున్నారు.
మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని రేవంత్ ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే, కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ డీజీపీపై అవినీతిపరుడనే ముద్ర వేశారు. ఆయన్ను ఎలా టీఎస్‌పీఎస్‌సీకి చైర్మన్ గా నియమిస్తారంటూ ప్రభుత్వంపై చిందులు తొక్కారు కవిత. అప్పుడు కవిత గోలపెడితే అర్థం కాలేదు. కానీ, మెల్లమెల్లగా అర్థమవుతోంది ఏమిటంటే.. మహేందర్ రెడ్డి అప్రూవల్ గా మారిపోతే తమ హయాంలో గుట్టుచప్పుడు కాకుండా జరిపిన వ్యవహారాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే కవిత అలా మాట్లాడినట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. బీఆర్ ఎస్ హయాంలో ఒక్కో వ్యవహారం వెలుగులోకి వస్తుండటంతో కల్వకుంట్ల కుటుంబంలోనూ కలహాలు మొదలైనట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి మాత్రమే అన్యాయం జరగలేదు.. బీజేపీ నేతలుసైతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇబ్బందిపడ్డారు. దీంతో కేసీఆర్ గుట్టు విప్పి.. జైలుకు పంపించడంలో రేవంత్ రెడ్డికి కేంద్రంలోని మోడీ సహకారం కూడా ఉందని, ఉంటుందని ప్రచారం జరుగుతుండటం కేసీఆర్ కు పుండుమీద కారం చల్లినట్లు ఉందని పరిశీలకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ విషయంలో రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు ఇస్తుందనీ, రేవంత్ ఆపరేషన్ సక్సెస్ అవుతుందన్న ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో పోరుగా సాగుతోంది.
కేంద్రం, రాష్ట్రంలో కూడా కేసీఆర్ కు మద్దతు లేకపోవడంతో తప్పించుకొనే అవకాశంలేక కొత్త ఎత్తుగడగా తనమీద కాంగ్రెస్, బీజేపీలు కలిసి పగతోనే దాడిచేస్తున్నాయని, తాను సత్తెపూసను అని జనాన్ని నమ్మించి సానుభూతి పొందాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇందుకోసం వందల యూట్యూబ్ చానల్స్ సృష్టించి. అక్రమంగా సంపాదించిన వేలకోట్లు వెదచల్లి తప్పుడు వార్తలతో రేవంత్ రెడ్డిపై బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో కరవు వచ్చిన సమయంలో రైతులు పడ్డ ఇబ్బందుల వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో కరువుతో ప్రజలు అల్లాడుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, ఆ ప్రచారంతో లోక్ సభ ఎన్నికల్లో లబ్ధిపొందాలని కేసీఆర్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పార్లమెంట్ ఫలితాలతో సంబంధం లేకుండా కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ గుట్టును రట్టు చేసేందుకు రేవంత్ ముందుకెళ్తే ఆఖరి అస్త్రంగా చంద్రబాబును శరణు వేడేందుకు సైతం కేసీఆర్ వెనుకాడరని అంటున్నారు. దీంతో గతంలో చంద్రబాబును ఆ దేవుడుకూడా కాపాడలేడన్న కేసీఆర్ కు త్వరలో చంద్రబాబే దేవుడైనా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.