posted on Mar 12, 2024 12:16PM
ఏపీలో కమలం ఖాతా ఓపెన్ చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకోసమే తాత్సారం చేసి చేసి తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసి నడిచేందుకు నిర్ణయించుకుంది. తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసి అడుగులు వేయకుండా ఏపీలో జీరోయే అన్న విషయం బీజేపీ ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సిన వాస్తవం. కావడంతో చివరి నిముషం వరకూ బెట్టు చేసి, సీట్ల బేరసారాల్లో తమ బలానికి మించి ఒకటి రెండు సీట్లైనా అదనంగా పొందాలన్న వ్యూహాన్ని అనుసరించింది. సరే బీజేపీ వ్యూహం ఫలించిందా లేదా అన్నది పక్కన పెడితే తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కూడా అడుగులు వేస్తుందన్న విషయంలో సందిగ్ధత తొలిగిపోయింది. ఇక ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ ముందు ఉంది. ఏపీ బీజేపీలో నిన్న మొన్నటి వరకూ పోటీ చేయడానికి అభ్యర్థులు పెద్దగా కనిపించని పరిస్థితి. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన కూటమితో పొత్తు కుదిరిందో.. ఇక ఆ పార్టీలో టికెట్ల కోసం పోటీ పడే ఆశావహుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. పొత్తుకు ముందు బీజేపీ రాష్ట్రంలో ఒంటరి పోరుకే మొగ్గు చూపుతోందన్న ప్రకటనలు వెలువడ్డాయి. ఆ సమయంలో పార్టీ తరఫున పోటీ చేయడానికి కాగడా పెట్టి వెతికినా అభ్యర్థులెవరూ కనిపించని పరిస్థితి ఉంది.
విశాఖ నుంచి పోటీ అంటూ గత కొన్నేళ్లుగా అక్కడే మకాం వేసి.. తన స్థాయిలో నానా రకాలుగా రాజకీయం చేసిన జీవీఎల్ కూడా ఒంటరి పోరు అనగానే పోటీకి వెనుకడుగు వేస్తున్నారని రాష్ట్ర బీజేపీ వర్గాలే అప్పట్లో చెప్పాయి. అయితే ఒక సారి పొత్తు కుదిరిందన్న వార్త వెలువడగానే.. నిన్న మొన్నటి వరకూ పోటీ అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు పార్టీ తరఫున పోటీ చేయడానికి టికెట్ల కోసం పార్టీ హైకమాండ్ ముందు క్యూ కడుతున్నారు.
ఇప్పుడు పొత్తు లో భాగంగా 10 అసెంబ్లీ,6 పార్లమెంటు స్థానాలకు పోటీ చేయడానికి బీజేపీ రెడీ అవుతోంది. అయితే ఎంత మంది ఆశావహులు పోటీకి తయారైనా.. పొత్తులో భాగంగా తమకు ఆమోదయోగ్యమైన వారినే పోటీలో నిలబెట్టాలని చంద్రబాబు ముందుగానే బీజేపీ హైకమాండ్ ను ఒప్పించడంతో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు కచ్చితంగా చంద్రబాబు ఆమోదించిన వారే అయి ఉంటారనడంలో సందేహం లేదు.
చంద్రబాబు ఈ షరతుతోనే పొత్తుకు అంగీకరించడానికి కారణం.. ఏపీ బీజేపీలో ఒక వర్గం ఈ ఐదేళ్లుగా జగన్ సర్కార్ తో అంటకాగింది. ఆ వర్గం జగన్ విధానాలను విమర్శించిన పాపాన పోలేదు. అదే సమయంలో తెలుగుదేశంపైనా, చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించింది. మొత్తం మీద ఈ సారి పొత్తుల వల్ల ముందు ముందు తనకు కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఇబ్బందులు రాకుండా చంద్రబాబు అన్ని జాగ్రత్తలూ తీసుకునే ముందుకు అడుగు వేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.