
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో జనసేన.. భీమవరాన్ని కొట్టి తీరాలి అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరంలో జనసేన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు.. గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే.. బంధుత్వాల పేరుతో ఇబ్బంది పెట్టారు. యుద్దం చేయనీకుండా నాకు సంకెళ్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరంలో కంటే పులివెందులలో పోటీ చేసి ఉంటే బాగుండేదని అనుకున్నా. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోయి ఉన్నా.. నేను బాధపడేవాడిని కాదన్నారు. సీట్లు తగ్గిపోయాయని కొందరు బాధపడుతున్నారు. కానీ, గతంలో నా ఒక్క సీటు గెలిచి ఉంటే.. ఇవాళ పరిస్థితి వేరేగా ఉండేదన్నారు. గతంలో జరిగిన తప్పిదాలకు నేను పరిహరం కడుతున్నాను. ఇవాళ నవశకం ప్రారంభించాం అన్నారు.
Read Also: Pawan Kalyan: సీట్ల కోతపై స్పందించిన పవన్.. ఆసక్తికర వ్యాఖ్యలు
భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి.. పొత్తులను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యారని తెలపారు పవన్.. గత ఎన్నికల్లో భీమవరం నుంచి నేను ఓడిపోతే.. నాపై పోటీ చేసిన రామాంజనేయులు చాలా బాధపడ్డారు. తాను పోటీ చేయకుండా ఉంటే బాగుండేదని రామాంజనేయులు కొద్దిమందితో అన్నారు. గొడవలు పెంచే వారు నాకొద్దు.. తగ్గించేవారు కావాలి.. అందుకే రామాంజనేయులను పార్టీలోకి ఆహ్వానించాను అని తెలిపారు. భీమవరంలో పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికి కూడా స్థలం ఇవ్వకుండా ఎమ్మెల్యే గ్రంధి అడ్డుకున్నారని మండిపడ్డారు పవన్.. నేను పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికే గ్రంధి శ్రీనివాస్ అడ్డుకున్నారంటే.. ఎంత రౌడీయిజం చేస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. ఇక, నాకు యుద్దం చేయడమే తెలుసు. కత్తి దూసినప్పుడు.. బంధువులంటే ఎలా..? అని ప్రశ్నించారు. భీమవరం నుంచి గ్రంధి శ్రీనివాస్ ను తన్ని తరిమేయాలి అంటూ పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.