
పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వంపై సినీ నటుడు ఎంఎన్ఎం పార్టీ చీఫ్ కమల్ హాసన్ ధ్వజమెత్తారు. దేశాన్ని విభజించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు ప్రజలను విభజించి.. భారతదేశ సామరస్యాన్ని నాశనం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలనే తపనతో.. ఎన్నికల సందర్భంగా సీసీఏను హడావుడిగా తెచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది కాబట్టి.. నోటిఫికేషన్ని విడుదల చేసిన సమయం మరింత సందేహాస్పదంగా ఉందని కమల్ హాసన్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ చట్టం అణగారిన మతపరమైన మైనారిటీలను రక్షించడానికి ఉద్దేశించినట్లైతే.. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న శ్రీలంక తమిళులను సీఏఏ పరిధిలోకి ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభలో తీర్మానాలు ఆమోదించడంలో.. ఇతర రాష్ట్రాల కంటే తమిళనాడు ముందంజలో ఉందని అన్నారు. ఈ చట్టంపై ఇన్నాళ్లూ నిర్లక్ష్యం వహించిన కేంద్ర ప్రభుత్వం.. సరిగ్గా రంజాన్ నెల ప్రారంభానికి ఒక రోజు ముందు దీనిని అమల్లోకి తెచ్చిందని.. ముస్లిం సోదరులకు చేదువార్తను అందించిందని మండిపడ్డారు.
తన ఎంఎన్ఎం పార్టీ సీఏఏని వ్యతిరేకించిందని, సుప్రీంకోర్టులో దీనిని సవాలు చేసిన మొదటి వ్యక్తి తానేనని కమల్ హాసన్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ముందే హడావుడిగా ఈ చట్టాన్ని అమలు చేయడం.. బీజేపీ దుర్బుద్ధికి నిదర్శమని కమల్ హాసన్ ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వం వాస్తవికతను విస్మరించడం ఖండించదగిన విషయమని.. మనమంతా కలిసికట్టుగా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని కమల్‌హాసన్ పిలుపునిచ్చారు.