Leading News Portal in Telugu

Siddaramaiah: కావేరీ జలాలపై సిద్ధరామయ్య ఏమన్నారంటే..!



See

బెంగళూరులో నీటి సంక్షోభం నెలకొన్న వేళ కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేస్తున్నారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య కొట్టి పారేశారు. అవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు.

బెంగళూరు నగరంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న వేళ కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేస్తున్నట్లు ప్రతిపక్ష బీజేపీ చేస్తోన్న ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. అవన్నీ అబద్ధాలేనంటూ కొట్టిపారేశారు.

కర్ణాటకలో నీటికొరత ఎదుర్కొంటున్న ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క నీటిబొట్టును కూడా తమిళనాడుకు ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. చామరాజనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కావేరీ జలాలపై బీజేపీ ప్రచారమంతా అబద్ధమని కొట్టిపారేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు నీళ్లు ఇస్తారు? మన వినియోగానికి నీటిని ఉంచుకోకుండా తమిళనాడుకు చుక్క నీరు కూడా ఇవ్వమని చెప్పుకొచ్చారు. అయినా తమిళనాడు మమ్మల్ని అడగనప్పుడు మేం నీళ్లు ఎందుకు ఇస్తాం? వారికి ఇవ్వడానికి అసలు మన దగ్గర నీరు ఎక్కడ ఉన్నాయి? అని తెలిపారు. తమిళనాడు అడిగినా.. కేంద్రం లేదా ఇంకెవరైనా నీరు విడుదల చేయాలని కోరినా వాళ్లకు ఇచ్చే ప్రశ్నే లేదని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు.

ప్రస్తుతం కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ నీటి సంక్షోభం నెలకొంది. వేసవి ప్రారంభంలోనే నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేస్తోందంటూ కర్ణాటకలో ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక సోమవారం ఆరోపణలు చేశారు. తక్షణమే నీటి విడుదలను ఆపాలని డిమాండ్‌ చేశారు. ఆయన చేసిన ఆరోపణలపై తాజాగా స్పందించిన సిద్ధరామయ్య.. అవన్నీ అవాస్తవాలేనని.. అసలు తమిళనాడుకు ఇచ్చేందుకు నీళ్లు ఎక్కడ ఉన్నాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.