Leading News Portal in Telugu

Shivaraj kumar: భార్యకు మద్దతుగా ప్రచారబరిలో శివన్న..



Shivaraj Kumar

Shivaraj kumar: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తన భార్య గీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి శివమొగ్గ ఎంపీ స్థానం నుంచి గీత పోటీ చేస్తోంది. తన భార్యకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని ఆయన మంగళవారం తెలిపారు. మార్చి 9న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో కర్ణాటక నుంచి శివరాజ్ కుమార్ భార్య గీత పేరు ఉంది. ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు జరుగుతున్నాయని, అవసరమైనప్పుడు తాను ప్రచారంలో పాల్గొంటా అని ఆయన బెళగావిలో చెప్పారు. తన భార్య కోసం ప్రచారం చేయాలని తన తోటి నటీనటులను అడగలేదని అన్నారు.

Read Also: Tamil Nadu: బీజేపీలో శరత్ కుమార్ పార్టీ విలీనం.. అన్నామలై సమక్షంలో చేరిక

‘‘తాము గెలవడానికి వచ్చాము. ప్రచారంలో పాల్గొనాలని ఇతర నటీనటులను ఒత్తిడి చేయము. ఈసారి వేడి ఎక్కువగా ఉంది. వారు ఒత్తిడికి గురికాకూడదు. కానీ మేము పిలిస్తే వారు వస్తారు. దాన్ని అడ్వాంటేజ్‌గా మేం తీసుకోవాలని అనుకోవడం లేదు. మనం యాక్టర్లకు స్పేస్ ఇవ్వాలి’’ అని అన్నారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా శివరాజ్ కుమార్ కాంగ్రెస్ తరుపున ప్రచారం చేశారు.

శివరాజ్ కుమార్ భార్య గీత మాజీ ముఖ్యమంత్రి సారెకొప్ప బంగారప్ప కుమార్తె. ఆమె సోదరుల్లో ఒకరు మధు బంగారప్పు రాష్ట్రమంత్రి కాగా, మరో సోదరుడు కుమార్ బంగారప్పు బీజేపీ పార్టీలో ఉన్నారు. బంగారప్ప కుటుంబాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నారా..? అని మీడియా ప్రశ్నించగా.. బంగారప్పు కుటుంబాన్ని ఏకం చేయడానికి నేను ఎవరు..? అని, నేను అతడి అల్లుడిని, కొడుకును కాదని శివరాజ్ కుమార్ సమాధానం ఇచ్చారు.