Leading News Portal in Telugu

తెలుగుదేశం శ్రేణుల అనుమానాలూ, భయాలూ నిజమౌతున్నాయా? | are tdp cadre fears real| tdp| janasen| bjp| alliance| seat| share| votes


posted on Mar 13, 2024 6:08PM

తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలిసిరావడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలూ కలగబోతున్నాయా? ముఖ్యంగా  బీజేపీ పొత్తులో భాగంగా తాను పోటీ చేయనున్న స్థానాలలో  నిలబెట్టే అభ్యర్థుల కారణంగా నష్టమే ఎక్కువ సంభవించనుందా? అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. తొలి నుంచీ సోము వీర్రాజును తాము బ్లాక్ లిస్ట్ లో పెట్టామని  చెబుతూ వచ్చిన బీజేపీ, ఇప్పుడు ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చేందుకు రెడీ అయ్యిందన్న అనుమానాలు తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి. తనకు టికెట్ కోసం సోము వీర్రాజు పార్టీ హైకమాండ్ వద్ద చేసిన లాబీయింగ్ ఫలించిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు జగన్ కు, ఆయన పార్టీకీ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నా అతి జాగ్రత్తకు పోయి బీజేపీ బలాన్ని మించిన స్థానాలను ఆ పార్టీకి పొత్తులో భాగంగా కేటాయించడం వల్ల తెలుగుదేశం నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.

పార్టీ కోసం, రాష్ట్రం కోసం త్యాగాలకు తాము సిద్ధమే అయినా.. నిన్నటి వరకూ నిలువెల్లా తెలుగుదేశం వ్యతిరేకతను నింపుకుని, పార్టీపైనా, పార్టీ నేతలపైనా విమర్శలు గుప్పించడమే కాకుండా, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించిన బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వంటి వారిని పొత్తులో భాగంగా అభ్యర్థిగా నిలబెడితే ఎలా అని తెలుగుదేశం శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.  2014 ఎన్నికలలో తాము గెలిచిన  తాడేపల్లి గూడెం సీటును పొత్తులో భాగంగా ఈ సారి తమకే కేటాయించాలని బీజేపీ పట్టుబడుతోంది.  అయితే అందుకు జనసేన అంగీకరించడం లేదు. ఒక వేళ అంగీకరిస్తే ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజును నిలపాలని యోచిస్తున్నది. అయితే తాడేపల్లిగూడెం నుంచి బరిలో నిలిచేందుకు  జనసేనకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు  బొల్లిశెట్టి శ్రీను రూపంలో బలమైన అభ్యర్థి ఉండటంతో ఆ సీటును వదులుకోవడానికి జనసేన ససేమిరా అంటున్నది.

దీంతో బీజేపీ ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా  అనపర్తి  నియోజకవర్గంతమకు కేటాయించాలనీ, అక్కడ నుంచి నుంచి సోము వీర్రాజును పోటీకి దింపుతామని బీజేపీ కోరుతోంది. అయితే ఇందుకు తెలుగుదేశం అంగీకరించే పరిస్థితులు లేవు. ఏది ఏమైనా పొత్తులో భాగంగా తమ కోటాకు వచ్చే స్థానాలలో ఎక్కడో ఒక చోట నుంచి సోము వీర్రాజును పోటీలో దించాలని బీజేపీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం శ్రేణుల భయం ఏమిటంటే.. సోము వీర్రాజు ఏ స్థానం నుంచి పోటీ చేసినా అక్కడ వైసీపీ అభ్యర్థి గెలవడం ఖాయం. తెలుగుదేశం, జనసేన ఓట్లు ఆ నియోజకవర్గంలో బీజేపీకి ట్రాన్స్ ఫర్ కావడం అసాధ్యం.

అయితే సోము వీర్రాజును కూటమి అభ్యర్థిగా అంగీకరించాల్సిన పరిస్థితి కచ్చితంగా ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.   తెలుగుదేశం, జనసేనలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థులనే పొత్తులో భాగంగా తమకు దక్కిన స్థానాలలో బీజేపీ నిలపాలన్న అవగాహనకు తూట్టు పొడిచే విధంగా ఆ పార్టీ వ్యవహరిస్తున్నదా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.

బీజేపీ ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవడంలో భాగంగానే జనసేన కొన్ని స్థానాలలో అభ్యర్థులను ప్రకటించేసిందనీ, తెలుగుదేశం కూడా సాధ్యమైనన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను తన రెండో జాబితాలో గురువారం (మార్చి 14) ప్రకటించనుందనీ పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల చిన్నపాటి అసంతృప్తి, అసమ్మతి వ్యక్తమైనా మొత్తం మీద మూడు పార్టీల పొత్తు తరువాత ఓట్ ట్రాన్స్ ఫర్ విషయంలో ఉన్న అనుమానాలు చాలా వరకూ పటాపంచలైపోయాయని చెబుతున్నారు.