Leading News Portal in Telugu

Putin: ఉక్రెయిన్‌కు మద్దతిస్తే జరిగేది అణు యుద్ధమే.. అమెరికాకు తాజా వార్నింగ్



Putin

అమెరికాకు మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి వార్నింగే ఇచ్చారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం సాగింది. కానీ ఈసారి మాత్రం రష్యా ఎన్నికల ముందు అగ్రరాజ్యం అమెరికాకు పుతిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదని తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. మార్చి 15-17 మధ్య రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అకారణంగా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ఉపయోగించాల్సిన అవసరం రష్యాకు లేదని స్పష్టం చేశారు.

సాంకేతికంగా అణు యుద్ధానికి రష్యా సిద్ధంగా ఉందని.. కానీ అందుకు తొందరపడటం లేదని చెప్పుకొచ్చారు. ఈ విషయం అమెరికాకు కూడా తెలుసని పేర్కొన్నారు. ఒకవేళ ఉక్రెయిన్‌కు మద్దతుగా సైన్యాన్ని పంపితే.. యుద్ధంలో ఆ దేశం నేరుగా జోక్యం చేసుకున్నట్లేనని.. దానికి తప్పకుండా బదులిస్తామని హెచ్చరించారు.

ఇక ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా సుముఖంగా ఉందని పుతిన్ స్పష్టం చేశారు. అయితే ఆ చర్చలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగాలన్నారు. ఒకవేళ అమెరికా అణు పరీక్షలు చేపడితే.. రష్యా కూడా వాటిని పరీక్షిస్తుందని పుతిన్‌ వార్నింగ్ ఇచ్చారు.

ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆ దేశానికి మద్దతుగా నాటో దేశాలు ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో తమ లక్ష్యాలను సాధించి తీరతామని, ఈ యుద్ధంలో అతిగా జోక్యం చేసుకోవడం వంటి చర్యలు.. ప్రపంచ అణు సంఘర్షణ ముప్పుతో నిండి ఉన్నాయని పశ్చిమదేశాలను పుతిన్ హెచ్చరించారు.