Leading News Portal in Telugu

Balineni Srinivasa Reddy: పొత్తులపై చంద్రబాబు రోజుకో రాజకీయం.. ప్రతీ ఒక్కరూ జగన్‌కు అండగా ఉండాలి..!



Balineni

Balineni Srinivasa Reddy: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు పొడిచింది.. సీట్లు కూడా ఖరారు కావడంతో.. అన్ని పార్టీలు అభ్యర్థల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.. అయితే, తాజా పొత్తులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. దివంగత నేత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు అదనంగా మరికొన్ని పథకాలను ప్రజలకు అందిస్తున్నారని ప్రశంసలు కురిపించిన ఆయన.. పొత్తులపై రోజుకో రకంగా రాజకీయం చేస్తున్నారు అంటూ చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు.. 2019లో వారంతా చెత్త అని బయటకు వచ్చాడు.. మళ్లీ ఇవాళ ఏం అవసరం వచ్చిందో.. ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని దుయ్యబట్టారు. అవసరం తీరాక వాడుకుని వదిలేసే రకం చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు.

Read Also: Viral Video : 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఐస్ క్రీమ్.. ధర ఎంతో తెలుసా?

ఇక, ఈ ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ఒంటరిగా ముందుకు వెళ్తున్నారు.. ప్రతీ ఒక్కరూ సీఎం జగన్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు బాలినేని.. టీడీపీ, జనసేన, బీజేపీలు కలసి వైఎస్‌ జగన్ పై పోరుకు వస్తున్నాయి.. పేదలకు మేలు చేసేది ఒక్క వైఎస్సార్ కుటుంబం మాత్రమే.. ప్రతీ ఒక్కరూ సీఎం జగన్ కు అండగా ఉండాలని సూచించారు.. ఏ పార్టీ అని చూడకుండా.. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగనే అన్నారు. మా ప్రభుత్వంలో మీకు మంచి జరిగితే, లబ్ధిచేకూరితేనే మీ బిడ్డకు అండగా ఉండాలని అంటూ చెబుతున్న దమ్మున్న లీడర్‌ సీఎం జగన్‌ అన్నారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.