
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్నికల సంఘం స్వీకరించిందని.. సకాలంలో సంబంధిత సమాచారాన్ని అందజేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏప్రిల్ 12, 2019 నుంచి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ECకి సమర్పించాలని ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ డేటాను ఎన్నికల సంఘానికి అందజేసింది.
ఇక ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సకాలంలోనే వివరాలను ఎస్బీఐ అందించిందని సీఈసీ తెలిపారు. అలాగే వివరాలను పరిశీలిస్తున్నామని.. సకాలంలోనే ఆ వివరాలు అందిస్తామని చెప్పుకొచ్చారు.
జమ్మూ కాశ్మీర్లో రాబోయే లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు సీఈవో రాజీవ్ కుమార్ శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
ఇక లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని అన్ని పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని సీఈసీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లంతా పండుగలా.. ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనవలసిందిగా రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇక తప్పుడు వార్తలపై స్పందించేందుకు అన్ని జిల్లాల్లో సోషల్ మీడియా సెల్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభ్యర్థులందరికీ తగిన భద్రత కల్పిస్తున్నామని.. కేంద్ర బలగాలు మోహరించాయని చెప్పుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్లో ఆన్లైన్ నగదు బదిలీలపై కఠినమైన నిఘా ఉంచినట్లు ఆయన చెప్పారు.
గత ఆరేళ్ల నుంచి జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం లేదు. అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. మరోవైపు జమిలి ఎన్నికలకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆల్పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.