
ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. బుధవారమే రష్యా అధ్యక్షుడు పుతిన్.. అణు యుద్ధం తప్పదంటూ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలపై డ్రోన్ దాడులను ప్రయోగించింది. దాదాపు 36 డ్రోన్లతో రష్యా దాడులకు తెగబడినట్లుగా తెలుస్తోంది.
రష్యా జరిగించిన తాజా దాడుల్లో పౌరులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అలాగే 22 విమానాలు కూడా కూలిపోయినట్లు వెల్లడించారు. నాలుగు నగరాల్లో ఈ డ్రోన్ దాడులు జరిగినట్లుగా పేర్కొన్నారు. ఇక ఈశాన్య ఉక్రెయిన్‌లో టీవీ సిగ్నల్‌కు అంతరాయం కలిగినట్లు సమాచారం.
కమ్యూనికేషన్స్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా డ్రోన్ దాడులు జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు. రష్యా రాత్రిపూట సామూహిక డ్రోన్ దాడులు చేయడంతో కొన్ని ప్రాంతాలు టెలివిజన్, రేడియో సిగ్నల్స్ కోల్పోయాయని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది.
దాదాపు రెండేళ్ల నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. కానీ తాజాగా జరిపిన దాడులు మాత్రం.. కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసే విధంగానే జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో రష్యా కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోందని సైన్యం అనుమానిస్తోంది.
ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఫోన్ సిగ్నల్స్‌కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధికారులు హెచ్చరిస్తు్న్నారు. ఈశాన్య ఉక్రెయిన్‌లో రష్యాకు సరిహద్దుగా ఉన్న ఖార్కివ్ ప్రాంతంలో టీవీ మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో మరమ్మతులు జరుగుతున్నాయని గవర్నర్ ఒలేహ్ సైనెహుబోవ్ చెప్పారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్.. పశ్చిమ దేశాల మీద ఆధారపడి.. రష్యాపై యుద్ధం సాగిస్తోంది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా చేస్తు్న్నాయి. వాటి ద్వారానే రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం సాగిస్తోంది.
ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్.. పశ్చిమ దేశాలను హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు సహకరిస్తే.. అణు యుద్ధం తప్పదని హెచ్చరించారు. కొద్ది రోజుల్లోనే రష్యాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందిస్తూ పుతిన్‌పై బూతులు ఉపయోగించారు.