Leading News Portal in Telugu

CAA: అమెరికా జోక్యంపై భారత్ ఏం రిప్లై ఇచ్చిందంటే..!



Caa

పౌరసత్వ సవరణ చట్టం అంశంపై తమను ఆందోళనకు గురిచేస్తోందని అగ్రరాజ్యం అమెరికా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర పెద్దలు స్పందించారు.

సీఏఏ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫికేషన్ గురించి ఆందోళన చెందుతున్నామని మార్చి 11న అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఈ చట్టం అమలు తీరును తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, మతపరమైన స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలు చట్టం ప్రకారం సమానమేనని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు.

అమెరికా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం ఇది తమ దేశ అంతరంగిక వ్యవహారం అని.. ఇందులో జోక్యం చేసుకోవద్దని సూచించింది.

అమెరికా ప్రకటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం 2019 భారతదేశ అంతర్గత విషయమని అన్నారు. సీఏఏపై అమెరికా వ్యాఖ్యలు అవగాహన లేని మాటలు అంటూ కొట్టిపారేశారు. డిసెంబర్ 31, 2014 న లేదా అంతకు ముందు భారతదేశానికి వచ్చిన అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో హింసకు గురైన హిందూ, సిక్కు, బౌద్ధ, పార్శీ, క్రైస్తవ వర్గాలకు చెందిన మైనారిటీలకు ఈ చట్టం రక్షణగా ఉంటుందని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

సీఏఏపై దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రాల్లో అమలు చేయమంటూ ఇప్పటికే కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు, మరికొన్ని రాష్ట్రాలు ప్రకటన చేశాయి.