
దేశ రాజధాని ఢిల్లీలో శరణార్థులు చేసిన నిరసనలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా జైలులో ఉండాల్సి వారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం దగ్గర నిరసనలు చేపట్టారు. రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఈ సందర్భంగా సీఏఏపై కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఉన్న ప్రజలకే ఉపాధి లేనప్పుడు.. బయటి వ్యక్తులను దేశంలోకి ఎందుకు రానిస్తున్నారని కేంద్రాన్ని కేజ్రీవాల్ నిలదీశారు.
సీఏఏతో దేశవ్యాప్తంగా ఆయా చోట్ల ఆందోళనలు మొదలయ్యాయి. తాము భారత పౌరసత్వం తీసుకున్నందున భారతదేశ ప్రజలమేనని, తీవ్రవాదులు అనే ముద్ర వేయడం ఎంత వరకు సమంజసం అని నిరసనకారులు ప్రశ్నించారు. గత 15 సంవత్సరాలుగా ఢిల్లీలో నివసిస్తున్నామన్నారు. మా ఇబ్బందులు చూడలేక మోడీ ప్రభుత్వం తమకు పౌరసత్వం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారని ఆందోళనకారులు చెప్పుకొచ్చారు.
నిరసనకారులను ఉద్దేశించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ పాకిస్థానీల ధైర్యం? మొట్టమొదట మన దేశంలోకి అక్రమంగా చొరబడి.. మన దేశంలోని చట్టాలను ఉల్లంఘించారని తెలిపారు. జైల్లో ఉండాల్సిన వారు నిరసనలు చేసి అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సీఏఏ వచ్చాక పాకిస్థానీలు, బంగ్లాదేశీయులు దేశమంతటా వ్యాపించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తారని వ్యాఖ్యానించారు. వారిని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే బీజేపీ దేశం మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోందని కేజ్రీవాల్ మండిపడ్డారు.
మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం అంశంపై తమను ఆందోళనకు గురిచేస్తోందని అగ్రరాజ్యం అమెరికా చేసిన వ్యా్ఖ్యలను కేంద్ర పెద్దలు తిప్పికొట్టారు. సీఏఏ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇది తమ దేశ అంతరంగిక వ్యవహారం అని.. ఇందులో జోక్యం చేసుకోవద్దని భారత్ సూచించింది.