Leading News Portal in Telugu

Congress-RJD: కుదిరిన సీట్లు సర్దుబాటు.. ఎవరెవరికి ఎన్నంటే..!



Con Rjd

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఆయా పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు ఇండియా కూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయి. బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల సీనియర్ నేతలు చర్చలు సాగిస్తున్నారు.

బీహార్‌లో మొత్తం 40 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దీంతో ఇరు పార్టీల నేతలు.. సీట్ల సర్దుబాటుపై సోమవారం సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌కు 9 సీట్లు ఇచ్చే ఛాన్సుందని సమాచారం. అలాగే కాంగ్రెస్ కూడా 9 సీట్లతో అడ్జెస్ట్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరికొన్ని సీట్లకు డిమాండ్ చేస్తున్న.. ప్రస్తుత పరిస్థితుల్లో హస్తం పార్టీ సర్దుకుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

భాగల్పూర్, ఔరంగాబాద్, ససారం, కతిహార్, కిషన్‌గంజ్, ముజఫర్‌పూర్, పాట్నా సాహిబ్, వైశాలి లాంటి నియోజకవర్గాలను కాంగ్రెస్‌కు ఆర్జేడీ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మధుబని, మోతిహారి, పశ్చిమ చంపారన్, సమస్తిపూర్‌ సీట్లను కూడా కాంగ్రెస్ ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే ఆర్జేడీ మాత్రం.. కాంగ్రెస్‌కు తొమ్మిది సీట్ల కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

గత శనివారమే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న పోలింగ్ ప్రారంభమై.. జూన్ 1న ఓటింగ్ ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పటి వరుకు కాంగ్రెస్ రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 39, రెండో విడతలో 43 మందిని వెల్లడించింది. మూడో జాబితాను త్వరలోనే విడుదల చేయనుంది. ఇందుకోసం కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. మూడో జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవలే బీఆర్ఎస్‌కు చెందిన పలువురు లీటర్లు హస్తం గూటికి చేరారు. వారికి లోక్‌సభ సీట్లు కేటాయించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.