
దేశంలోనే అతిపెద్దదైన తీహార్ జైలులో ఖైదీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖైదీలు జైలు లోపల ఫోన్ల వినియోగాన్ని నిరోధించేందుకు ఆరు చోట్ల 15 జామర్లను పెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫోన్లు, బేస్ టవర్ల మధ్య సిగ్నల్ ప్రసారాలు నిలిపివేసే ఈ జామర్లను రూ.11.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల జైలు లోపల ఇకపై 2జీ, 3జీ, 4జీ నెట్వర్కులు పనిచేయవు.
ఇప్పటికే జైల్లో కాల్ బ్లాకింగ్ కోసం టవర్స్ ఆఫ్ హార్మోనియస్ కాల్ బ్లాకింగ్ వ్యవస్థ ఉండగా.. దీనికి ఈ 15 జామర్లు అదనమని పేర్కొన్నారు. ఈ జామర్ల ఏర్పాటు రెండు నెలల క్రితమే ప్రారంభం కాగా.. ఈ నెలఖరుకు పనులు పూర్తికానున్నాయని తిహాడ్ జైలు డీజీ సంజయ్ బానీవాల్ వెల్లడించారు.
తీహార్ జైలులోని తొమ్మిది జైళ్లలో హైసెక్యూరిటీ ఉండే ఆరు జైళ్లలో ఈ జామర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మరో అధికారి తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతం 19 వేల మంది ఖైదీలు ఉండగా.. తీహార్, మండోలి, రోహిణి.. ఈ మూడు జైళ్లలో 10 వేల మంది ఖైదీల సామర్థ్యంతో ఉన్నాయి. తిహాడ్‌లో ఎంట్రీ పాయింట్ల దగ్గర అనేక స్థాయిల్లో తనిఖీలు చేసినప్పటికీ ఖైదీలు తరచూ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా జైలు గోడల వెలుపల నుంచి మొబైల్ఫోన్లు తరచూ విసిరేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
గత కొన్నేళ్లలో జైలు లోపల ఉన్న గ్యాంగ్స్టర్లు వీడియో కాల్స్ చేయడం, వారి సెల్ఫోన్లో వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పాటు బయటి వారికి బెదిరింపు కాల్స్ చేయడం వంటి ఘటనలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఖైదీల ఆగడాలను అరికట్టేందుకు మొబైల్ సిగ్నల్స్‌ను నియంత్రించేలా జామర్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఢిల్లీలోని మూడు జైళ్లలో అనధికారికంగా మొబైల్ ఫోన్లను వినియోగించే సమస్యను పరిష్కరించడానికి గత ఏడాది లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి:Mohan Babu: మోడీ లాంటి వ్యక్తి భారతదేశానికి అవసరం