Leading News Portal in Telugu

Off The Record : ఉమ్మడి కడప జిల్లా టీడీపీ నేతల్లో ఆందోళన పెరుగుతుందా.?



Otr Tdp

ఉమ్మడి కడప జిల్లా టీడీపీ నేతలు ఎక్కువ మందిలో ఆందోళన పెరుగుతోందా? బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారంటీ అని ప్రచారం చేద్దామంటే… తమ భవిష్యత్‌కే గ్యారంటీ లేకుండా పోతోందని కంగారు పడుతున్నారా? ఇక్కడి నేతలు ఏం కోరుకుంటున్నారు? పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారు? కొందరు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మరి కొందరు పక్క పార్టీల వైపు ఎందుకు చూస్తున్నారు? కడప టీడీపీలో కలకలం రేగుతోందట. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకం సమస్యతో సతమతం అవుతున్నారు నేతలు. ఇన్నాళ్ళు నానా కష్టాలు పడి కాపు కాస్తే… ఇప్పుడొచ్చి ఎవరో టిక్కెట్‌ని తన్నుకుపోతున్నారని ఆవేదనగా ఉన్నారట చాలా మంది నేతలు. కన్నీళ్ళు పెట్టుకుంటున్న వాళ్ళు సైతం ఉన్నారు. ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి మొండిచేయి చూపింది అధిష్టానం. సర్వేల పేరుతో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డికి టిక్కెట్‌ దక్కింది. కష్టకాలంలో అండగా ఉన్న తనను కాదని… వరదరాజులురెడ్డికి ఎలా ఇస్తారంటూ కన్నీటి పర్యంతం అయ్యారట ప్రవీణ్‌. కన్నతల్లి లాంటి పార్టీ మోసం చేసిందని, అమ్మను చెప్పుతో ఎలా కొట్టగలనంటూ కేడర్‌ దగ్గర ఘాటుగానే రియాక్ట్‌ అవుతున్నట్టు తెలిసింది. కోవర్టులకు టికెట్లు ఇస్తున్నారని కూడా ఆరోపణల వర్షం కురిపించారాయన. అటు జమ్మలమడుగు నియోజకవర్గ పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ టిడిపికి నేతలే కరవైన పరిస్థితుల్లో అండగా నిలిచారు దేవగుడి భూపేష్ రెడ్డి. ప్రాజెక్టుల సందర్శన పేరుతో కడప జిల్లాకు వచ్చిన చంద్రబాబు నాయుడు నాటి బహిరంగ సభలో ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ రెడ్డి అని ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకు బాబు ష్యురిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ అంటూ ప్రజలకు వెళ్లారాయన.

అయితే నేడు తన భవిష్యత్తుకే గ్యారెంటీ లేకుండాపోయిందని వాపోతున్నారట భూపేష్‌. జమ్మలమడుగు స్థానాన్ని పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు. దీంతో భూపేష్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఇక రాయచోటిలో ఇంకో స్టోరీ. పదేళ్ల నుంచి ఇక్కడ ఇన్చార్జిగా కొనసాగుతూ వచ్చిన రమేష్ రెడ్డికి ఈసారి టిక్కెట్‌ గ్యారంటీ లేకుండా పోయింది. ఆయనను కాదని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీ పోస్టర్లను తగులు పెట్టారు కార్యకర్తలు. ఇక టిడిపిలో ఇమడలేక భవిష్యత్ గ్యారెంటీ కోసం రమేష్‌రెడ్డి వైసిపి వైపు చూస్తున్నట్టు సమాచారం. అటు రాజంపేటలో అంతకంటే గొప్పగా ఏమీలేదట. ఇప్పటివరకు టిడిపి ఇన్చార్జిగా కొనసాగుతూ వచ్చిన బత్యాల చెంగల్ రాయుడు పేరును గత రెండు లిస్ట్‌ల్లో కూడా ప్రకటించలేదు. దీంతో చెంగల్రాయుడుకు టికెట్ ఇవ్వాలంటూ రోడ్డెక్కారు తెలుగు తమ్ముళ్ళు. ఆయన్ని కాదని బయట వ్యక్తికి ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని కూడా కుండబద్దలు కొట్టేస్తున్నారట. ఇక వర్గ విభేదాల సంగతి చెప్పనక్కర్లేదు. ఇలా…టికెట్ల వ్యవహారం ఉమ్మడి కడప జిల్లాలో టిడిపికి తలనొప్పిగా మారిందట. ప్రతి సీటు ప్రతిష్టాత్మకంగా మారిన పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఎలా సెట్‌ చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.