
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాస్ట్రంలోని బదౌన్ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు బాలురను స్థానికంగా ఉండే బార్బర్ సాజిత్ గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన తర్వాత యూపీ పోలీసులు నిందితుడిని ఎన్కౌంటర్లో చంపేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపింది. మంగళవారం జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితులను చూపిస్తున్నాయంటూ ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), అధికార బీజేపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమైందని విరుచుకుపడింది.
Read Also: CM Siddaramaiah: నేను బలమైన సీఎంని, నీలాగా బలహీన పీఎంని కాదు.. మోడీపై విమర్శలు..
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తప్పుపట్టారు. ‘‘ఇద్దరు సోదరులు ప్రాణాలు కోల్పోయారు, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎన్కౌంటర్ ద్వారా దాచలేరు’’ అని మండిపడ్డారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలడాన్ని సూచిస్తోందని అన్నారు. అయితే, బీజేపీ ఈ విమర్శలకు ధీటుగా స్పందించింది. బీజేపీ ఎంపీ సంఘమిత్ర మౌర్య స్పందిస్తూ.. ఎస్పీ పాలనలో రికార్డులను గుర్తు చేసుకోవాలని, సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా నేరాలు, అల్లర్లు జరిగాయని, అల్లర్లను ప్రారంభించిన వాళ్లు కూడా ఎస్పీ నేతలే అని ఆమె ఆరోపించారు. యూపీలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిన విడిచిపెట్టడం లేదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, యోగి సర్కార్‌పై ప్రశంసలు కురిపించారు. ఎస్పీకి మద్దతు తగ్గడంతో ఆ పార్టీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని, యూపీలో హిందువులైనా, ముస్లింలైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించిన వారిని ఎవరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ దీనిని జంగిల్ రాజ్‌గా అబివర్ణించింది.
బుదౌన్ డబుల్ మర్డర్:
సాజిద్ అనే బార్బర్ మంగళవారం సాయంత్రం స్థానికంగా ఉండే వినోద్ కుమార్ ఇద్దరు పిల్లల్ని కిరాతకంగా హతమార్చాడు. తన భార్య డెలివరీకి రూ. 5000 అవసరమని సాజిద్ తన భార్యను సంగీతను అడిగాడని, డబ్బు తీసుకొచ్చేందుకు తన భార్య లోపలికి వెళ్లిన సమయంలో అతను తన ఇద్దరు పిల్లలపై కత్తితో దాడి చేశారని వినోద్ కుమార్ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నాడు. దాడి తర్వాత అక్కడ నుంచి పారిపోయిన సాజిద్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతడిని పట్టుకునే క్రమంలో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీంతో రక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నిందితుడు సాజిద్ హతమయ్యాడు.