
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఇండియా కూటమి నేతలు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్‌లపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆ ముగ్గురు నేతలపై చర్యలు తీసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖలను ఆదేశించాలంటూ పిటిషనర్ సూర్జిత్ సింగ్ యాదవ్ చేసిన రిక్వెస్ట్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు మేర పారిశ్రామికవేత్తల రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిందని రాహుల్, అఖిలేష్, కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను పిటిషన్‌లో ప్రస్తావించారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ , జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషన్‌ను కొట్టివేసింది.
భారతీయ ఓటర్ల జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయలేమని.. ఎవరు నిజం మాట్లాడుతున్నారో.. ఎవరు అబద్ధాలు చెబుతున్నారో వారికి తెలుసు అని ధర్మాసనం పేర్కొంది. ఎవరు నాయకత్వం వహిస్తున్నారో.. ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో దేశ ప్రజలకు తెలుసు అని.. ప్రజలే నిర్ణయం తీసుకుంటారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. విపక్ష నేతల వ్యాఖ్యల వల్ల ఎవరైనా పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది కలిగితే.. వారే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని.. థర్డ్ పార్టీ ద్వారా పిల్ వేయాల్సిన అవసరం ఏముంటుందని కోర్టు పేర్కొంది.