
బీఆర్‌ఎస్‌లో అభ్యర్థుల్ని ప్రకటించకుండా మిగిలిపోయిన సీట్ల సంగతి ఏంటి? కవిత అరెస్ట్ తర్వాత పార్టీలో పరిస్థితి ఎలా మారిపోయింది? ఆ ఐదు సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యేది ఎన్నడు? అర్ధంతరంగా ఆగిపోయిన పార్లమెంట్ నియోజకవర్గాల రివ్యూల సంగతి ఇక అంతేనా? లోక్‌సభ ఎన్నికల విషయంమై పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత తత్వం బోధపడ్డ బీఆర్‌ఎస్ అధిష్టానం… రివ్యూ మీటింగ్స్ పెట్టింది. నాడు ఓడిపోవడానికి కారణాలపై పోస్ట్‌మార్టంతో పాటు… లోక్‌సభ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద నియోజకవర్గాల నేతలతో చర్చిస్తోంది. ఈ రివ్యూ మీటింగ్స్‌కు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరవుతున్నారు. వాళ్ల ఫీడ్ బ్యాక్‌తో పాటు తమ దగ్గరున్న సమాచారాన్ని బేరీజువేసుకుని అభ్యర్థుల విషయంలో క్లారిటీకి వస్తున్నారు పార్టీ పెద్దలు. ఈ ప్రక్రియ జరుగుతుండగానే ఊహించని షాక్ తగిలింది పార్టీకి. ఏడాది కాలంగా నానుతూ వస్తున్న మద్యం కేసులో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అయ్యారు. ఇక అక్కడి నుంచి అసలు నైరాశ్యం మొదలైందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె అరెస్ట్ అవడంపై పార్టీ లీడర్స్, కేడర్ కంగారుగా, తీవ్ర గందరగోళంలో ఉన్నట్టు తెలిసింది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఓట్లు రాబట్టాలనుకుని బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే… కవిత అరెస్ట్ అయిన తెల్లారే ఆ పొత్తు విచ్ఛిన్నమైంది.
చివరికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ రాజీనామా చేసి గులాబీ కండువా వేసుకోవాల్సి వచ్చింది. ఇక అంతకు ముందు రోజు వరకు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాల రివ్యూ సమావేశాల ఊసే లేకుండా పోయింది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు ఉండగా…పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించలేదు బీఆర్‌ఎస్. ప్రకటించిన వాళ్ళలో బీ ఫామ్ ఇచ్చేదాకా ఎందరు పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న కంగారు పెరుగుతోందట కారు పార్టీ కేడర్‌లో. ఇప్పటి దాకా పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి రివ్యూలు చేసి 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక ఫైనల్ చేయాల్సిన మెదక్, సికింద్రాబాద్, హైదరాబాద్, భువనగిరి, నాగర్ కర్నూలు స్థానాల్లో రివ్యూలు జరగలేదు. నల్గొండ సీటుకు రివ్యూ జరిగినా అభ్యర్థిని ప్రకటించలేదు. పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో ఉంటే.. ముఖ్య నేతలు హరీష్ రావు , కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఎవరికి వారు బిజీ గా ఉండడంతో డిసైడ్ చేయకుండా మిగిలిపోయిన ఐదు నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదంటున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున అభ్యర్థులను ప్రకటించి, ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం ఇది. కానీ… ఆ పని చేయాల్సిన అధినాయకత్వం కవిత అరెస్ట్ మీద, ఈడీ కేస్ మీద దృష్టి పెట్టడంతో ఏం జరగబోతోందోనన్న కంగారు పెరుగుతోంది గులాబీ కేడర్‌లో. ఈ పరిణామాలు ఎలా మారబోతున్నాయోనని రాజకీయవర్గాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి.