
Sadananda Gowda: లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ డీవీ సదానంద గౌడ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. బెంగళూర్ నార్త్ సీటు నుంచి వేరే అభ్యర్థిని ప్రకటించడంతో ఆయన కలత చెందానని, దీంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సదానంద గౌడ గురువారం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజేని బీజేపీ బరిలోకి దింపింది. ప్రస్తుతం శోభ ఉడిపి చిక్ మగళూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంది.
Read Also: Lok Sabha Elections 2024: ఏడు దశాబ్ధాల ఎన్నికల చరిత్రలో 14 నుంచి 6కి తగ్గిన జాతీయ పార్టీలు..
‘‘ బెంగళూర్ నార్త్ సీటు నాకు ఇవ్వకపోవడంతో కలత చెందాను. పార్టీ ఇలా ప్రవర్తించినందుకు బాధగా ఉంది. కానీ నేను బీజేపీ కోసమే పనిచేస్తాను. బీజేపీ తనకు అన్నీ ఇచ్చింది. బీజేపీ కోసం పనిచేసి పార్టీని ప్రక్షాళన చేయడమే నా లక్ష్యం. పార్టీని ప్రక్షాళన చేయడానికి చాలా మంది ఉన్నారు. కానీ ఎక్కడో వారు దిగజారుతున్నారు. రాష్ట్రంలో పార్టీ బాధ్యత ఎవరు తీసుకున్నా సరైన దిశలో వెళ్లడం లేదు’’ అని సదానంద గౌడ అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా తనకు ఆహ్వానం అందిందని, అయితే ఆ పార్టీలో చేరనని స్పష్టం చేశారు.నియంతృత్వ నాయకత్వం రాజకీయాల్లో పనిచేయదని ఆయన అన్నారు. ఈ రోజు తాను చేసిన వ్యాఖ్యలు కేవలం కర్ణాటకకు మాత్రమే పరిమితమని, తాను పార్టీని ప్రక్షాళన చేస్తే తప్ప వెనక్కి తగ్గనని, లోక్సభ ఎన్నికల తర్వాత అంతా మారిపోతాయని ఆయన అన్నారు. దేశమే కుటుంబమని ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లే, కర్ణాటకలో పార్టీ కూడా దీనిని అనుసరించాలి, నరేంద్రమోడీ మళ్లీ ప్రధాని కావాలి, పార్టీని కుటుంబ రాజకీయాలను రూపుమాపడం, ప్రక్షాళన చేయడమే తన లక్ష్యమని చెప్పారు.