
AP CEO MK Meena: రాజకీయ హింసాత్మక ఘటనలపై మూడు జిల్లాల ఎస్పీలను వివరణ కోరానని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన హత్య రాజకీయ హింసేనని జిల్లా ఎస్పీ చెప్పారన్నారు. ఆళ్లగడ్డ హత్య ఘటన కుటుంబాల మధ్య కక్షల వల్ల హత్య జరిగిందని ఎస్పీ చెప్పారని ఆయన వెల్లడించారు. మాచర్ల కారు దహనం ఘటన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణేనని ఎస్పీ తెలిపారన్నారు. మాచర్ల ఘటనలో ఈ రాత్రికి నిందితులను అరెస్ట్ చేస్తానని ఎస్పీ వివరణ ఇచ్చారని సీఈవో పేర్కొన్నారు. మూడు ఘటనలపై ఎస్పీల నుంచి వివరణ తీసుకున్నాం.. ఇవాళే ఈసీఐ నివేదిక ఇస్తామన్నారు.
Read Also: YSRCP: ‘నిజం గెలవాలి’ కార్యక్రమంపై ఏపీ సీఈఓకు వైసీపీ ఫిర్యాదు
ఎన్నికల కోడ్ వచ్చాక రాజకీయ హింస జరగకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. కోడ్ వచ్చిన మరుసటి రోజే హింసాత్మక ఘటనలు జరగడంతో ఈసీఐ ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలని ఈసీఐ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటుందని చెప్పారు. హింసాత్మక ఘటనలు జరగ్గకూడదని ఎస్పీలకు గట్టిగా చెప్పామని.. రాజకీయ హింసను నిరోధించేలా అన్ని పార్టీలతో మాట్లాడాలని అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించామన్నారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో పరామర్శ చేసుకోవచ్చు కానీ.. చెక్కులు పంపిణీ చేయకూడదని ఆదేశించారు. డబ్బుల పంపిణీ కోడ్ ఉల్లంఘనే.. దీనిపై జిల్లా కలెక్టర్లని నివేదికలు అడిగామన్నారు.