
ఫోన్లు… ఒకటే ఫోన్లు…. విపరీతమైన ఫోన్ కాల్స్. అందులో మీరున్నారంటగా అంటూ ఎటకారపు ఎంక్వైరీలు. సంబంధం లేదన్నా నమ్మని పరిస్థితి. ఒక సీఐ అయితే ఒక్క రోజులో వంద దాకా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవాల్సి వచ్చిందట. చివరికి తట్టుకోలేక స్విచాఫ్ చేసుకవాల్సి వచ్చిందట. ఇంతకీ ఎక్కడుంది అంత భయంకరమైన సిచ్యుయేషన్? ఎందుకు అంతలా సీఐలకే ఫోన్‌కాల్స్ వస్తున్నాయి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీఎస్పీ ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతున్నాయి. జిల్లాలోని చాలా మంది పోలీస్ అధికారులకు ఈ విషయమై ఊపిరి సలపని ఫోన్స్ వస్తున్నాయట. ఆ కేస్‌లో మీరున్నారా? ఆ ఇద్దరిలో ఒక పేరు మీదేనంట కదా? అంటూ తెలిసిన వాళ్ళు, శ్రేయోభిలాషులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండటంతో… అబ్బే… అది నేను కాదని చెప్పుకోలేక సతమతం అవుతున్నారట. ఇంకొందరైతే… ఇదెక్కడి శీల పరీక్షరా.. బాబూ… అంటూ తలకొట్టుకుంటున్నట్టు తెలిసింది. ప్రణీత్‌రావు ఎస్ఐబీ డీఎస్పీగా పని చేసిన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఒక సర్వర్ రూమ్‌ను వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఏర్పాటు చేసినట్టు దర్యాప్తులో వెల్లడైందంటున్నారు. అక్కడి ఒక ప్రైవేటు వ్యక్తి ఇంటి నుంచే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అందులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసిన ఇద్దరు ఇన్ స్పెక్టర్లు భాగస్వాములయ్యారనే ప్రచారం జరిగింది. అంతే కాదు… ఆ ఇద్దరు ఇన్ స్పెక్టర్లను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే అది వట్టిదేనని తర్వాత తేలినా.. ఇద్దరు సిఐలకు నోటీసులు వచ్చాయన్న ప్రచారంతో కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న చాలామంది సిఐలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారట. ఆ నోటీసులు అందుకున్న వారిలో మీరు ఉన్నారా అంటూ చాలామంది ఫోన్లు చేస్తుండటంతో నాకేం సంబంధం లేదంటూ చెప్పుకోలేక చచ్చిపోతున్నట్టు తెలిసింది.
ఇప్పుడు పని చేస్తున్నవారితో పాటు గతంలో ఇక్కడ వర్క్ చేసి ట్రాన్స్‌ఫర్ అయిన వారిని సైతం ఈ ఫోన్‌కాల్స్ వెంటాడుతున్నాయట. ఎవరికి వారు నేను కాదు మొర్రో అని మొత్తుకుంటున్నా… నోటీసులు అందుకున్న ఆ ఇద్దరు ఎవరన్న ఎంక్వైరీలు మాత్రం ఆగడం లేదంటున్నారు. ఎక్కడా పేర్లు బయటికి రాకపోవడంతో… ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న చాలా మంది సీఐల వైపు అనుమానపు చూపులు పెరుగుతున్నాయట. దీంతో చాలా మంది ఆఫీసర్స్ ఇదేం ఖర్మ ప్రణీత్‌రావా… ఏం ఇరికించావ్ నాయనా… అని పదే పదే అనుకుంటున్నారట. ఈ కేసుతో వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దయాకర్‌రావుకు లింక్ ఉందని, ఆయన స్వగ్రామంలోనే ఓ ప్రైవేట్ ఇంటిని అద్దెకు తీసుకొని ప్రణీత్‌రావు ఓ సర్వర్ ఏర్పాటు చేశారని ప్రచారం జరిగింది. దీంతో అప్పట్లో ఎర్రబెల్లి పరిధిలో పనిచేసిన పలువురు సీఐలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో పనిచేసిన సిఐ లతోపాటు పర్వతగిరి పోలీసు స్టేషన్‌లో డ్యూటీస్ చేసిన ఇద్దరు సీఐలు కూడా ఫోన్ కాల్స్ సమస్యను ఎదుర్కొంటున్నారట. ఇక పాలకుర్తి నియోజకవర్గంలో రెండు సర్కిల్ కేంద్రాలైన తొర్రూరు … పాలకుర్తి స్టేషన్స్‌లో చేసిన మరో నలుగురు సిఐలు… అలాగే మంత్రి దయాకర్ రావు, ప్రణీత్ రావు సామాజిక వర్గానికి చెందిన దాదాపు పదిమందికి పైగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్స్‌కు ఈ శీల పరీక్షలు తప్పడం లేదంటున్నారు.గతంలో ఐటీ సెక్టర్‌లో పనిచేసి మొన్నటి వరకు మాజీ మంత్రి ఇలాకాలో ఉన్న ఒక సర్కిల్ అయితే… నన్ను నమ్మండి ప్లీజ్….నాకు ట్యాపింగ్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ మొత్తుకుంటున్నారట. ఒకే రోజు వందకు పైగా ఫోన్ కాల్స్ అటెండ్ చేయాల్సి వచ్చిందట ఆయన. ఆ దెబ్బకు తట్టుకోలేక పర్సనల్ మొబైల్ స్విచాఫ్ చేసుకోవాల్సి వచ్చిందంటే… పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నది పోలీస్ వర్గాల టాక్. ఇలా ఎవరికి వారు మాకు నోటీసులు రాలేదని చెబుతూ… అలాంటి సమాచారం వస్తే మా చెవిన కూడా వేయండని ఫోన్ చేసిన వారికి చెబుతుండటంతో అంతా గందరగోళంగా మారిపోతోందట. ప్రణీత్‌రావుతో లింకులున్న ఆ ఇద్దరు ఎవరో తేలితే తప్ప ఈ వ్యవహారం సద్దుమణగదన్నది వరంగల్ పోలీస్ కమిషనరేట్ వర్గాల మాట.