
పాలిటిక్స్‌లో ఇన్నాళ్ళు కోవర్ట్ రాజకీయాల గురించి విన్నాం. కానీ.. ఇప్పుడు అక్కడ అంతకు మించి అన్నట్టుగా ఉందట వ్యవహారం. ఏకంగా ఒప్పంద రాజకీయం నడుస్తోందట. పది మంది నాయకులు పార్టీ మారతామంటే అందులో ఇద్దరికే ఛాన్స్ ఇచ్చి మిగతా వారిని టచ్‌లో ఉంచుకుంటున్నారు. మరి వాళ్ళందర్నీ ఏం చేయమంటున్నారు? ఎక్కడ జరుగుతోందా కొత్త రకం రాజకీయం? ఎలక్షన్ టైంలో ఏ రాజకీయ పార్టీ అయినా వలసలకు సై అనడం, గేట్లు తెరిచి జై కొట్టడం కామన్. బలం, బలగం పెరుగుతుందన్న కోణంలో రా… రమ్మని పిలవడం కూడా సహజం. అయితే… ఆ విషయంలో చిత్తూరు తమ్ముళ్ళు మాత్రం కాస్త తేడాగా ఉన్నారట. టీడీపీలోకి వస్తామని పది మంది అడిగితే… అందులో అతి ముఖ్యమైన ఇద్దరు ముగ్గురికి కండువాలు కప్పేసి మిగతా వారిని మాత్రం ఇప్పుడు మీరున్న పార్టీలోనే ఉండండి… కాకుంటే… పని మాత్రం మాకు చేయండబ్బా… అంటూ చెవిలో చెప్పేస్తున్నారట. ఇప్పుడు ఇదే జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్. వస్తానన్న వాళ్ళని ఎందుకు వద్దంటున్నారంటే.. అక్కడే ఉంది అసలు కిటుకు అంటున్నారట. పోనీ… వాళ్ళని కోవర్ట్‌లుగా మారుస్తున్నారా అంటే.. అదేం కాదంటూ ససమాధానం దాటవేస్తున్నారు. అది ఇదీ కాకుండా వచ్చే వాళ్లని ఎందుకు వద్దంటున్నారంటే వ్యూహం బహుముఖమని చెబుతున్నట్టు తెలిసింది. తంబళ్ళపల్లె, నగరి, పలమనేరు,చంద్రగిరి, పూతలపట్టులో ఇలాంటి ప్లాన్ అవులవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తంబళ్ళపల్లె టీడీపీ అభ్యర్ధిగా జయచంద్రా రెడ్డి పార్టీలోకి వచ్చి రెండు, మూడు నెలలే అయినా… ప్రత్యర్థి ద్వారకనాధ్ రెడ్డికి షాక్ ఇస్తున్నారని అంటున్నారు. సైలెంట్ గా ద్వారకనాధ్ రెడ్డి కోటరిలోని వ్యక్తులు, వారి అనుచరులకు టచ్ లోకి వెళ్ళారన్నది లోకల్ టాక్. పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నవారితో ఇదే రీతిలో టైఅప్ అయినట్టు తెలిసింది. ఇక నగరి వైసిపిలోని అసంతృప్త నతలు కూడా టీడీపీవైపు చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇన్ఛార్జ్ భానుప్రకాశ్ ప్రస్తుతానికి కొందరే ముద్దు అందరూ వద్దంటున్నారట.
చంద్రగిరిలో పులివర్తి నాని, పలమనేరులో మాజీ మంత్రి అమరనాధరెడ్డి, పూతలపట్టులో మురళీ మోహన్ సైతం అదే వ్యూహం అమలు చేస్తున్నారట. పార్టీలోకి వస్తామంటూ… అధికార పార్టీ నేతలు క్యూ కడుతున్నా ఇలా ఎందుకు చేస్తున్నారంటే… మీకు తెల్దుగానీ… మా చిత్తూరు రాజకీయమే వేరప్పా అంటున్నారు సదరు లీడర్స్. వస్తామన్న వాళ్లందరికీ ఓకే చెప్పేస్తే… పార్టీకి ఊపు వచ్చే సంగతి పక్కన పెడితే… ఉన్న కేడర్ అసంతృప్తితో అలుగుతుందని, అప్పుు మొదటికే మోసం వస్తుందని చెబుతున్నారట. మరి విరుగుడు ఏంటంటే… మీరు వైసిపిలోనే ఉండండి … కానీ మాకోసం పనిచేయండి… సైలెంట్ మీ పార్టీలోని మిగతా వాళ్ళ మద్దతు కూడా కూడగట్టండి అని స్పెషల్ క్లాస్‌లు తీసుకుంటున్నట్టు తెలిసింది. అక్కడి అసంతృప్తులను గుర్తించి వారిని తనవైపు తిప్పుకునేలా ఒప్పందాలు సైతం చేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారం అటు వైసీపీని కలవరపెడుతోందంటున్నారు పరిశీలకులు. ఈ ఒప్పందాలు కోవర్ట్ ఆపరేషన్ కంటే డేంజర్ రా.. బాబూ.. అంటున్నట్టు తెలిసింది. అలాంటి వారు తమ దగ్గర ఎవరున్నారని ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అలాగని అందర్నీ అనుమానిస్తే మొదటికే మోసం వస్తుందని కూడా భయపడుతున్నారట వైసీపీ నేతలు.పార్టీ వదిలి పోతే ఒకే… అలా కాకుండా ఒప్పందాలతో దొంగ దెబ్బవేస్తే ఎలాగన్న చర్చ ఇప్పుడు చిత్తూరు వైసీపీలో జరుగుతోంది. నియోజకవర్గంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు ఎవరికి చెప్పాలో…. ఎవరికి చెప్పకూడదో అర్ధంగాని పరిస్థితి లోకల్ వైసీపీలో ఉందంటున్నారు. ఇక టిడిపి సైతం తమ శిబిరంలో కూడా అలాంటి ఎవరున్నారా అని ఆరా తీస్తోందట. ఇదంతా వింటున్న వాళ్ళు మాత్రం ఈ చిత్తూరోళ్ళు మామూలోళ్ళు కాదు బాబూ… అంటున్నారు. మరి నయా ప్లాన్స్‌ని వర్కౌట్ చేసుకోగలిగేది ఎవరు? బలయ్యేది ఎవరన్నది చూడాలి.