
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఇండియా కూటమి సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ఈడీ అధికారుల తీరును తప్పుపట్టారు. తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను అడ్డంపెట్టుకుని బీజేపీ ఆడుతున్న డ్రామా అని మమత విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా ఆమె అభివర్ణించారు. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం చేయిస్తున్న ఈ చర్యలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేయడం దారుణం అని మమత మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని.. బీజేపీతో సంబంధాలు ఉన్నవారు ఎన్ని అక్రమాలు చేసినా వారికి శిక్ష పడదన్నారు. సీబీఐ, ఈడీ దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులైనా కమలం పార్టీతో జత కడితే వారిపై ఏ కేసూ ఉండదని మమత ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు. గత రాత్రంతా ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ఉన్నారు. మరోవైపు కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. వారిని ఎక్కడికక్కడే పోలీసులు నిలువరించారు. మరోవైపు ఆప్ మంత్రులను కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఇది కూడా చదవండి: Virat Kohli: మరో మైలురాయికి చేరువలో కోహ్లీ.. 6 పరుగులు సాధిస్తే..
ఇక కేజ్రీవాల్ అరెస్ట్‌పై ప్రతిపక్ష నేతలు సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా తమ వ్యతిరేకతను తెలిపారు. ఎన్నికల సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఇలా టార్గెట్ చేయడం తప్పు అని.. రాజ్యాంగ విరుద్ధం. ఈ విధంగా రాజకీయాల స్థాయిని తగ్గించడం ప్రధానమంత్రికి సరికాదు అని ప్రియాంక గాంధీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. అలాగే శరద్ పవార్ కూడా తప్పుపట్టారు. ఇక ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Stray Dogs : నిర్మల్‌లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలిక మృతి
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ తొమ్మిది సార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ఆయన్ను గురువారం సాయంత్రం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఉన్నత న్యాయస్థానంలో కూడా కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు.