Leading News Portal in Telugu

Kakarla Suresh: కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు



Kakarla Suresh

Kakarla Suresh: నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రేణమాల గ్రామంలో వైసీపీకి చెందిన 100 కుటుంబాలు, సుమారు 500 మంది ఓటర్లు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో మండల కన్వీనర్ ఓంకారం ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారందరికీ కాకర్ల సురేష్ టీడీపీ కండువా కప్పి స్వాగతించారు. వైసీపీ ప్రభుత్వంలో విసుగెత్తి వేసారి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకాలకు ఆకర్షితులై ఉదయగిరి సేవకుడు కాకర్ల సురేష్ వెంట నడవాలని టీడీపీలోకి చేరినట్లు వారు చెప్పకొచ్చారు.

Read Also: Minister Peddireddy Ramachandra reddy: ఇప్పటికే నాలుగు చోట్ల సిద్ధం సభలు.. మొత్తం 21 సభలు నిర్వహిస్తాం..

ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. తాను సేవకుడిని మాత్రమేనని పాలకుడిని కాదని వచ్చే టీడీపీ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని, సూపర్ సిక్స్ పథకాలతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ గ్రామానికి ప్రతి ఇంటి గడపకు వస్తాయన్నారు. ప్రజా వేదిక కూల్చడంతోనే వైసీపీ పతనానికి పునాది అయిందన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, ఉదయగిరి కోటలో జెండా ఎగర వేసేది తానేనని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని, వారి మాటల్లోనే అర్థమవుతుందన్నారు. వైసీపీ కాలం చెల్లిందని తెలిపారు. కనుక అత్యధిక మెజార్టీ సాధించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కానుకగా ఇద్దామన్నారు.

ముందుగా గ్రామస్తులు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్కు భారీ ఎత్తున బాణాసంచాలు పేల్చి, బ్యాండ్ మేళాల మధ్య పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. అనంతరం శాలువా గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఓంకారం, క్లస్టర్ ఇంచార్జ్ వెంకటాద్రి, జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య, రైతు కార్యదర్శి బొల్లినేని రమేష్, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.