Leading News Portal in Telugu

Raghunandan Rao : సూట్ కేసులు పట్టుకొచ్చిన వారికి టిక్కెట్లు ఇస్తున్నారు



Raghunandan Rao

పది సంవత్సరాలు పాలించిన బీఆర్‌ఎస్‌కు స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమని బీజేపీ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మర్కుక్ మండల కేంద్రంలోని రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీకి మెదక్‌లో ఒక్క స్థానిక అభ్యర్థి దొరకకపోవడం విడ్డూరమన్నారు. అలా అయితే బీఆర్ఎస్ పార్టీ దుకాణాన్ని బంద్ చేసుకోవాలని ఎద్దేవా చేశారు. మెదక్ సీటును ఆ పార్టీ ఇతర ప్రాంతాల వారికి అమ్ముకున్నదని ఆరోపించారు. సూట్ కేసులు ఇచ్చిన వారికి టిక్కెట్ ఇచ్చారని ధ్వజమెత్తారు.

ఈ గడ్డ మీద పుట్టిన వాడు… ఈ గడ్డ మీద పోరాడే వ్యక్తి బీఆర్ఎస్‌కు ఎందుకు దొరకలేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కర్రకాల్చి వాత పెట్టిన తర్వాత కూడా సూట్ కేసులు ఇచ్చిన వారికి టిక్కెట్ ఇవ్వడం దారుణం అన్నారు. పదేళ్లు పాలించిన పార్టీకి స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎవరి కోసం పని చేస్తుందో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ ప్రజలు కూడా ఓసారి ఆలోచించాలని కోరారు.

తెలంగాణ సమాజం మిమ్మల్ని ద్వేషిస్తోంది… మీరు అన్నా… మీ కుటుంబం అన్నా ద్వేషిస్తోంది… సమాజం ద్వేషం పగగా మారకముందే బీఆర్‌ఎస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి.. ఇంతకుముందే కరీంనగర్ జిల్లా వ్యక్తిని తెచ్చుకొని మెదక్ జిల్లాను నాశనం చేశారు… ఇప్పుడు ఇంకొక కరీంనగర్ వ్యక్తి ఈ ప్రాంతాన్ని నాశనం చేసేందుకు వస్తున్నాడు… కాబట్టి ఆలోచించాలని కోరారు. పక్క జిల్లాల పెత్తనం మనకు వద్దు… 610 జీవో అమలు జరగాలంటే పక్క జిల్లాల పెత్తనం మెదక్ జిల్లాపై వద్దు… పైసల కోసం సీట్లు అమ్ముకుంటున్న బీఆర్‌ఎస్ పార్టీని పార్లమెంట్ ఎలక్షన్‌లో ప్రజలు బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.