
తాను చేరలేనంత దూరం కాదు… దొరకనంత దుర్గం కాదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని శనివారం వివిధ కులసంఘాల ప్రతినిధులు కలిశారు. అలాగే 317 జీవో బాధిత ఉద్యోగులు కూడా కలిశారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్‌కు చెందిన రెవెన్యూ ఉద్యోగి దయాకర్ కలిశారు. జీవో 317 వల్ల ఇబ్బందులను ముఖ్యమంత్రికి వివరించారు. ఎన్నికలు ముగియగానే జీవో 317 ఇబ్బందులను పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఉద్యోగి దయాకర్ ముఖ్యమంత్రిని కలిసి ఆయన మెడలో కండువా కప్పి… పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఆ తర్వాత ఓ దరఖాస్తును ముఖ్యమంత్రి చేతికి ఇచ్చారు. తర్వాత ఆయనతో కలిసి ఫొటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను రేవంత్ రెడ్డి షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘నేను… చేరలేని దూరం కాదు… దొరకనంత దుర్గం కాదు… సామాన్యుడు మనిషిని నేను… సకల జన హితుడను నేను.’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.