Leading News Portal in Telugu

Kejriwal Arrest: అధికారి దురుసు ప్రవర్తన.. కోర్టుకు కేజ్రీవాల్ ఫిర్యాదు



Kejriwal

ఢిల్లీ పోలీస్ అధికారి తీరుపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని కేజ్రీవాల్ ఆరోపించారు. గతంలో మనీశ్‌ సిసోడియాను కూడా బలవంతంగా లాక్కెళ్లింది కూడా ఆయనేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన అప్లికేషన్‌లో ఈ విషయాన్ని కేజ్రీవాల్ తెలిపారు. తన భద్రతా వలయంలోని సిబ్బంది నుంచి ఆయన్ను తొలగించాలని కోరారు. అయితే ఈడీ సిబ్బంది మాత్రం తనతో మర్యాదగానే ప్రవర్తించారని కేజ్రీవాల్ వెల్లడించారు.

ఈడీ వేసిన రిమాండ్ పిటిషన్ విచారణలో భాగంగా శుక్రవారం కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చారు. ఆ సమయంలో అసిస్టెంట్ కమిషనర్ ఏకే సింగ్ తనతో దురుసుగా ప్రవర్తించారని సీఎం వెల్లడించారు. పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు సంబంధిత అధికారి అనుచిత ప్రవర్తనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను జాగ్రత్త చేయాలని అధికారులను అదేశించింది.

లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను కూడా కోర్టు ముందు హాజరు పరచే సమయంలోనూ ఇదే అధికారిపై లిఖితపూర్వక ఫిర్యాదు నమోదైనట్టు కేజ్రీవాల్ తరఫున దాఖలైన ఫిర్యాదులో పేర్కొన్నట్టు న్యాయమూర్తి తెలిపారు. అనంతరం జస్టిస్ కావేరీ బవేజా సంబంధిత అధికారులకు ఆదేశాలిస్తూ, కోర్టు రూము దగ్గర పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించినట్టు చెబుతున్న సీసీటీవీ ఫుటేజ్‌ను జాగ్రత్త చేయాల్సిందిగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్స్ అండ్ సెషన్స్ జడ్జి-కమ్-స్పషల్ జడ్జి రిక్వెస్ట్ లెటర్ రాయాలన్నారు. తదుపరి విచారణ సమయంలో ఫుటేజ్ కాపీని కోర్టు ముందు ఉంచాలని ఆమె ఆదేశాలిచ్చారు.

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్టు వేళ.. ఆప్‌ ఎమ్మెల్యే గులాబ్ సింగ్‌కు చెందిన ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ స్పందించారు. ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెట్టడంలో బీజేపీ బిజీగా ఉందని ఈ దేశంతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలుసని విమర్శించారు.

ఇది కూడా చదవండి: Sudha Kanduri: హీరోగా దసరా విలన్.. మలయాళంలో హీరోయిన్ గా తెలుగమ్మాయి ఎంట్రీ!

మరోవైపు లిక్కర్ కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను ప్రత్యేక న్యాయస్థానం ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాయి.

ఇది కూడా చదవండి: నేనేది ఫ్రీగా చేయను.. నా రేటు గంటకు రూ. 5 లక్షలు.. డైరెక్టర్ వైరల్ పోస్ట్