Leading News Portal in Telugu

Punganur: పుంగనూరులో వైసీపీకి షాక్‌..!



Punganur

Punganur: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్‌ పెరుగుతోన్న తరుణంలో.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు వైసీపీ నేత వెంకటరమణ రాజు.. ఈయన గతంలో పుంగనూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.. ఆ తర్వాత వైసీపీలో చేరాఉ.. అయితే, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో పుంగనూరు టీడీపీ అభ్యర్ధి చల్లా బాబు గెలుపుకోసం పనిచేస్తానని చంద్రబాబుకు హామీ ఇచ్చారు వెంకటరమణ రాజు.. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి కోసం కలసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచించారు చంద్రబాబు.

Read Also: Murder Case: వేట కొడవళ్లతో సత్యసాయి జిల్లాలో దారుణం.. టీడీపీ కార్యకర్త హత్య..!

కాగా, చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.. తన నియోజకవర్గం కుప్పం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవకపోతే రాష్ట్రం అదోగతిపాలవుతుందని హెచ్చరించారు. ఇక, కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.. నేడు డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు చంద్రబాబు.. రాజుపేట హాంద్రీ నీవా ప్రాజెక్టును పరిశీలించనున్నారు.. అనంతరం నాలుగు మండలాలకు చెందిన టీడీపీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు చంద్రబాబు నాయుడు.