Leading News Portal in Telugu

Delhi Metro: కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ నిరసన.. మెట్రో స్టేషన్లు మూసివేత



Delhi Metro

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చింది. దీని ప్రభావం ఢిల్లీలోని మెట్రోపై పడింది. ఇక, భద్రతా కారణాల దృష్ట్యా లోక్ కళ్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్‌లోని ప్రవేశ, నిష్క్రమణ గేట్లను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) మంగళవారం నాడు తెలిపింది. దీంతో పాటు పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లు కూడా మూసివేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలిపింది. ప్రయాణికులు ఇతర మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు.

Read Also: Mobile ReCharge: మొబైల్ యూజర్లకు బ్యాడ్న్యూస్.. పెరగనున్న రీఛార్జ్‌ ప్లాన్స్..

అయితే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నివాసాన్ని ముట్టడిస్తామని ఆప్ నేతలు తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ఒక్కసారిగా నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన ఏర్పాట్లు చేశారు. అలాగే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 28వ తేదీ వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు.