
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేకు 400 సీట్లు రావడం ఖాయమని, మోడీ ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆయా కాలనీల్లో పర్యటించారు. అంబర్ ట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్, సత్యా నగర్, రత్న నగర్ లో, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వెంకటగిరిలో ఆర్ట్రియా 10 అపార్ట్ మెంట్, కామపురి కాలనీలో శ్రీ సాయిరాం మనోహర్ అపార్ట్ మెంట్స్, శ్రీనగర్ కాలనీలోని ఎస్ బీహెచ్ కాలనీ, ఉషా ఎంక్లేవ్, సాయికిరణ్ అపార్ మెంట్స్, కామపురి కాలనీలో కృషి మిడాస్ తదితర ప్రాంతాల్లో బర్యటించి కాలనీవాసులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎవరు ప్రధానమంత్రి అవుతారో నిర్ణయించే ఎన్నికలు కావు. ప్రజలు నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి కావాలని నిర్ణయించుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు పెరుగుతాయనే చర్చ ప్రజ ఉన్నది. కులాలు, మతాలతీతంగా ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్లీ రావాలని ఆకాంక్షిస్తున్నారు”అని అన్నారు.
దేశ భద్రత.. ఎవరి చేతిలో దేశం భద్రంగా ఉంటుందో, రేపటి మన పిల్లల భవిష్యత్తుకు భరోసా ఉండాలంటే ఎవరు ప్రధాని కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కిషన్ రెడ్డి కాలనీవాసులకు పిలుపునిచ్చారు. ‘‘ప్రధాని మోడీ, ఆయన నాయకత్వం పట్ల ప్రజలు పూర్తి అభిమానంతో, విశ్వాసంతో ఉన్నారు. మోడీ నాయకత్వంలోనే మన దేశం, పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. భారీ మెజారిటీతో మోడీ మూడవసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. భారతీయ జనతా పార్టీకి 2019లో 302 సీట్లు వస్తే.. ప్రజలు ఇచ్చిన భరోసాతో ఆయన ఆర్టికల్ 370 రద్దుతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దీంతో దేశ ప్రజలు ఈసారి 370 సీట్లు కట్టబెట్టపోతున్నారు. ఎన్డీయే కూటమికి 400 సీట్లు రావడం ఖాయం. డిజిటల్ లావాదేవీల్లో, పేద సంక్షేమంలో, కరోనా వ్యాక్సిన్, ఉగ్రవాదంపై అణచివేత, అయిదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుదల లాంటి విజయాలు ప్రధాని మోడీ వల్లే సాధ్యమయ్యాయి”అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎంపీగా మీకు మాట రానివ్వను..
తాము ఓట్లు వేసి గెలిపించిన ఎంపీ ఫలానా స్కామ్ లో ఉన్నాడనో, ఫలానా తప్పు పని చేశాడనో ప్రజలు తలదించుకునే సందర్భాలు కొన్ని ఉంటాయని, అలాంటి వాటి విషయంలో తాను కచ్చితంగా దేశం కోసం నిలబడతానని కిషన్ రెడ్డి ఆయా కాలనీవాసులకు భరోసా ఇచ్చారు. ఎంపీగా తనను ఆశీర్వదిస్తే సమాజం కోసం, పేదల కోసం, దేశం కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా సికింద్రాబాద్ ప్రజలకు ఎలాంటి మాట రానివ్వనని స్పష్టం చేశారు. ‘‘ప్రజలు నన్ను వారి కుటుంబ సభ్యుడిలా ఆప్యాయతతో పలకరిస్తున్నారు. మీకు అండగా మేముంటామని సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారు. అందుకు రుణపడి ఉంటాను’’అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయా కాలనీల పర్యటన లో కిషన్ రెడ్డికి అడుగడుగునా సాదర స్వాగతం లభించింది. మహిళలు, కాలనీ పెద్దలు, ప్రముఖులు స్వాగతం పలికారు. వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కిషన్ రెడ్డి మాట్లాడారు.