Leading News Portal in Telugu

Pakistan: కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు చైనా పౌరుల మృతి



Pak

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి బీభత్సం సృష్టించింది. చైనా డ్రైవర్ సహా ఐదుగురు ఇంజనీర్లు మృతి చెందారు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆరుగురు చైనా పౌరులు మృతి చెందారని అధికారులు వెల్లడించారు.

మంగళవారం పాక్‌లో ఆత్మాహుతి బాంబర్‌ జరిపిన దాడిలో ఐదుగురు చైనా జాతీయులు.. వారి డ్రైవర్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చైనా ఇంజనీర్ల కాన్వాయ్‌.. ఇస్లామాబాద్ నుంచి ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని వారి క్యాంప్‌కు వెళుతుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి బాంబర్ భారీ పేలుడు పదార్థాలతో వాహనాన్ని ఢీకొట్టడంతో ఆరుగురు చైనా పౌరులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Sujana Chowdary: అధిష్టానం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తా..

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దాడిలో ఐదుగురు చైనా జాతీయులు, పాకిస్థానీ డ్రైవర్ మరణించారు అని ఉన్నత పోలీసు అధికారి తెలిపారు, అయితే కాన్వాయ్‌లోని మిగిలిన వ్యక్తులు మత్రం సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

ఆత్మాహుతి దాడిని పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు పాకిస్తాన్-చైనా స్నేహానికి హాని కలిగించేందుకు దుష్టశక్తులు ఎప్పటికీ విజయం సాధించలేరని ఆయన పేర్కొన్నారు. మృతి చెందిన చైనా కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. అలాగే విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఈ దాడిని ఖండించారు. దేశంలో ఉగ్రవాదులపై పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న నిర్మాణ సంస్థ చైనా గెజౌబా గ్రూప్ కంపెనీ.. తన సిబ్బందిని కాన్వాయ్‌లో తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా స్థానిక మీడియా తెలిపింది. 2021లో ఇదే కంపెనీపై దాడి జరిగింది. తొమ్మిది మంది చైనా పౌరులు సహా 13 మంది చనిపోయారు. ఆ సమయంలో మరణించిన చైనా కార్మికుల కుటుంబాలకు పాకిస్తాన్ లక్షలాది రూపాయల పరిహారం చెల్లించింది . దాడిపై విచారణకు చైనా తన బృందాన్ని కూడా పంపింది. తాజాగా జరిగిన దాడిలో ఐదుగురు ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు.