Leading News Portal in Telugu

Kejriwal: ఆ ఫుకార్లు నమ్మొద్దు.. ఆప్ సర్కార్ విజ్ఞప్తి



Kej

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నేపథ్యంలో తాజాగా రకరకాలైన వదంతులు పుట్టుకొస్తున్నాయి. సంక్షేమ పథకాలు నిలిచిపోతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆప్ సర్కార్ అప్రమత్తమైంది. కేజ్రీవాల్‌ అరెస్టుతో సంక్షేమ పథకాలు నిలిచిపోతాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆప్‌ సర్కార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్లానింగ్‌ డిపార్టుమెంట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో ఢిల్లీలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు, సబ్సిడీలు నిలిచిపోతాయంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేసింది. చట్టం తన పని తాను చేస్తుందని.. పథకాల అమలు, పాలన అనేవి ఎప్పుడూ వ్యక్తులకు సంబంధించినవి కావని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాన్య ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. కేజ్రీవాల్‌ ఆదేశాల మేరకే ఈ ప్రకటన విడుదల చేసినట్లు ఆప్‌ వర్గాలు స్పష్టం చేశాయి.

గతంలో మాదిరిగానే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు, రాయితీలు, పింఛన్లు తదితర సేవలన్నీ నిరాంతరాయంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రజా సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ కేటాయింపులతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నామని.. ఈ డబ్బు ఒక వ్యక్తి లేదా రాజకీయ పార్టీల సొంత ఆస్తులు కాదని వెల్లడించింది. అందువల్ల ముఖ్యమంత్రి అరెస్టు లేదా రిమాండ్‌తో ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని పేర్కొంది. కొన్ని స్వార్థపూరిత శక్తులు చేసే ఇలాంటి తప్పుదారి పట్టించే సమాచారాన్ని నమ్మొద్దని ఈ సందర్భంగా ప్రజలకు సర్కార్ విజ్ఞప్తి చేసింది.

ఇది కూడా చదవండి: DK Shivakumar: దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియాగాంధీ చేశారు.. కాంగ్రెస్‌తోనే దేశం ఐక్యంగా ఉంటుంది..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈనెల 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇక జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు ఆదేశాలు జారీ చేశారు. ఇక అరెస్ట్, ఈడీ కస్టడీపై హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ బుధవారం జరగనుంది. మరీ ఊరట లభిస్తుందా? లేదంటే జైల్లో ఉండాల్సి వస్తుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.

ఇది కూడా చదవండి: Manjummel Boys: మలయాళ ఇండస్ట్రీ హిట్, తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?