
ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. అరెస్ట్, కస్టడీపై అత్యవసరంగా విచారించాలని గత శనివారం ఆయన.. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆదివారంలోపు విచారించాలని ఆయన కోరారు. అయితే ఎమర్జెన్సీ విచారణకు న్యాయస్థానం నిరాకరించింది. ఆదివారం సెలవు కావడం.. అటు తర్వాత సోమ, మంగళవారాలు.. రెండు రోజులు ధర్మాసనానికి హోలీ సెలవులు వచ్చాయి. దీంతో బుధవారం విచారిస్తామని తెలిపింది. ఉదయం 10:30 గంటలకు జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ వ్యాజ్యాన్ని విచారించనున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఈనెల 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇక జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తారని ఆప్ మంత్రులు వెల్లడించారు. ఇప్పటికే కేజ్రీవాల్ రెండు ఆదేశాలు జారీ చేశారు. ఇక కేజ్రీవాల్ పంపించిన సందేశాన్ని.. ఆయన సతీమణి సునీతా చదివి వినిపించారు.
ఇది కూడా చదవండి: Seshu Passes Away: ఇండస్ట్రీలో విషాదం.. కమెడియన్ కన్నుమూత
2021-2022 మధ్య ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీ అమలులో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఈడీ, సీబీఐ గుర్తించింది. ఈ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గతేడాది నుంచి జైల్లో ఉన్నారు. ఆయనకు ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు. ఇటీవలే ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీ అనంతరం తీహార్ జైలుకు పంపించారు.
ఇది కూడా చదవండి: IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ విడుదల.. అడిలైడ్‌లో డే నైట్ టెస్టు
ఇదే కేసులో ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్‌కు తొమ్మిది సార్లు సమన్లు జారీ చేశారు. ఎప్పుడు కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈడీ అధికారులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మార్చి 21న హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. కానీ న్యాయస్థానం జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అనంతరం కొన్ని నిమిషాల్లోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఇండియా కూటమి పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.