
తెలంగాణలో ఈసారి బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారి పర్యటనల సందర్భంగా ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు. ఇప్పటికే ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థులను ప్రకటించినట్లు పేర్కొన్న కిషన్ రెడ్డి.. డోర్ టు డోర్ వెళ్లి ప్రజలను కలుస్తున్నామని, రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అంబర్ పేట్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని గోల్నాక డివిజన్ శ్రీనివాస్ టవర్స్ కదిరి భాగ్, శంకర్ నగర్ బస్తిలో పర్యటించారు. అనంతరం సనత్ నగర్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రామ్ గోపాల్ పేట్, కాబ్రా కాంప్లెక్స్, పాన్ బజార్, రాణిగంజ్, ప్యాట్నీ, కలాసిగూడ, ఓల్డ్ బోయిగూడా, నాలా బజార్, మొండా మార్కెట్ బస్తిల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమైందని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘తెలంగాణలో నిర్వహించిన ఐదు బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లు ప్రకటించాం. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాం. ప్రధానంగా భారీ బహిరంగ సభల కంటే.. డోర్ టు డోర్ వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడాలని నిర్ణయించాం. రాష్ట్ర స్థాయి నాయకుడు గానీ, జిల్లా స్థాయి నాయకుడు గానీ ప్రతి ఒక్కరూ డోర్ టు డోర్ వెళ్లే కార్యక్రమంలో విధిగా భాగస్వామ్యులయ్యేలా ప్రణాళిక రూపొందించాం. దేశవ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో కూడా.. డబుల్ డిజిట్ పార్లమెంట్ సభ్యులు గెలిచే అవకాశం ఉన్నది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు బీజేపీకి సానుకూలంగా స్పందిస్తున్నారు”అని కిషన్ రెడ్డి తెలిపారు.
గతంలో బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రజలు.. ఈసారి మాత్రం బీజేపేకే ఓటేస్తామని చెబుతున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. “ఈసారి దేశం కోసం ఓటేస్తాం.., అభివృద్ధికే ఓటేస్తాం, మా పిల్లల భవిష్యత్ కే ఓటేస్తాం.. అని తెలంగాణల ప్రజలు అంటున్నారు. ప్రజలు మరోసారి మోడీని ప్రధాన మంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఆయనను ఆశీర్వదిస్తున్నారు. అందుకే తప్పకుండా బీజేపీ తెలంగాణలో అత్యధిక సీట్లు సాధిస్తుంది. ఈసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ఆవశ్యకత లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే. ఇందులో ఏ పార్టీకి ఓటు వేసినా వృథానే అవుతుంది”అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.