
Pawan Kalyan: జనసేన శ్రేణులు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా పొత్తు ధర్మానికి భిన్నంగా.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడా పొరపాట్లకు, లోటుపాట్లకు తావివ్వకుండా మూడు పార్టీలూ క్షేత్ర స్థాయి నుంచి ముందుకు వెళ్ళాలని సూచించారు. కూటమి ఏర్పాటనేది ఏపీ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. పొత్తులో భాగంగా పార్టీ కోసం చేసిన త్యాగాలు రాష్ట్ర సౌభాగ్యం, అభివృద్ధి కోసమేనన్నారు. పొత్తు ధర్మాన్ని పాటిద్దాం.. మిత్రపక్ష కూటమిని గెలిపిద్దామని ఆయన సూచనలు చేశారు.
Read Also: CM YS Jagan: భావితరాల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం..
వీరమహిళలకు నియామక పత్రాలు
మరోవైపు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ కమిటీల్లో ఉన్న వీర మహిళలకు పవన్ కల్యాణ్ నియామక పత్రాలు అందజేశారు. రాజకీయంగా వీర మహిళల ఎదుగుదలకు జనసేన పార్టీ ప్రాధాన్యమిస్తుందని పవన్ పేర్కొన్నారు. వీర మహిళలు పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచారన్నారు. ప్రజా పోరాటాల్లోనూ ముందు వరుసలో నిలబడ్డారన్న ఆయన.. పార్టీ కోసం నిలబడిన వీర మహిళలను పార్టీ మర్చిపోదన్నారు. కులం, మతం, ప్రాంతాలు దాటి మహిళా నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపర్చే బాధ్యత తీసుకుంటానన్నారు. పార్టీకి, పాలనకు వారధిగా నిలిచేలా మహిళల సేవలు ఉపయోగించుకుంటామన్నారు. ప్రజా క్షేత్రంలో వీర మహిళలు చేసిన పోరాటాలు ఎప్పటికీ మరువలేమని పవన్ అన్నారు. అపజయంలోనూ వెనక్కి తగ్గకుండా గత ఐదేళ్లుగా వీర మహిళలు పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన తీరు గొప్పదని ఆయన కొనియాడారు.