
Water Crisis: వేసవి పూర్తిగా రాకముందే బెంగళూర్ నీటి సంక్షోభంలో చిక్కుకుంది. భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నగరంలోని ప్రజలు ఇప్పుడు బకెట్ నీటి కోసం గోస పడుతున్నారు. బెంగళూర్‌కి ఆధారమైన భూగర్భ జలాలు, కావేరీ నీరు తగ్గిపోవడంతో సమస్య జఠిలమైంది. ప్రజలు నీటి దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రుతుపవనకాలం వచ్చే వరకు ఈ పరిస్థితి తప్పకపోవచ్చని తెలుస్తోంది.
Read Also: Maldives: మాల్దీవుల్లో తాగునీటి కష్టాలు.. టిబెట్ సాయం
అయితే, ఒక్క బెంగళూర్ మాత్రమే కాదు, రాబోయే కాలంలో హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. 2030 నాటికి భారతజనాభాలో 40 శాతం మందికి తాగునీరు దొరకదని 2019లో నీతిఆయోగ్ ఒక నివేదికలో పేర్కొంది. బెంగళూరుతో పాటు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, బటిండా, లక్నో, చెన్నై తదితర నగరాలు నీటి ఎద్దడిని ఎదుర్కొనున్నట్లు తెలిపింది.
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(WWF) 2020 నివేదిక ప్రకారం 2050 నాటికి దేశంలోని 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని చెప్పింది. ఇందులో ఢిల్లీ, జైపూర్, ఇండోర్, అమృత్‌సర్, పూణె, శ్రీనగర్, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, కోజికోడ్ మరియు విశాఖపట్నం ఉన్నాయి. 2023 ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. భారతదేశంలోని సింధు-గంగా పరివాహక ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే భూగర్భ జలాల క్షీణతను ఎదుర్కొంటున్నాయి.. వాయువ్య ప్రాంతంలో 2025 నాటికి చాలా తక్కువ భూగర్భ జలాల లభ్యత తగ్గుతుందని చెప్పింది.