Leading News Portal in Telugu

AAP: రాష్ట్రపతి పాలన తప్పదంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వ్యాఖ్యలపై ఆప్ ఆగ్రహం



Atu

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా వ్యాఖ్యలపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని ఆమ్‌ఆద్మీ పార్టీ పేర్కొంది. జైలు నుంచే ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పాలన కొనసాగిస్తారని ఆప్‌ నేతలు చేస్తున్న ప్రకటనలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా స్పందించారు. ఢిల్లీ పాలన అలా నడవదని సక్సేనా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ప్రకటనపై ఢిల్లీ మంత్రి అతిశీ మాట్లాడుతూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎవరైనా చట్టసభ సభ్యుడు /సభ్యురాలు దోషిగా తేలితేనే వారి సభ్యత్వం రద్దవుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: Water Crisis: ఒక్క బెంగళూర్ మాత్రమే కాదు.. హైదరాబాద్‌తో పాటు 30 నగరాలకు పొంచి ఉన్న ప్రమాదం..

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చెబుతున్న రాజ్యాంగ నిబంధన ఏమిటీ? వీటికి సంబంధించి చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. అటువంటప్పుడు ఏ పరిస్థితుల్లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తారు? అని ప్రశ్నించారు. ఆర్టికల్‌ 356 అంశం అనేకసార్లు సర్వోన్నత న్యాయస్థానానికి చేరిందని మంత్రి అతిశీ పేర్కొన్నారు. పాలనకు ఏ విధమైన అవకాశాలు లేనప్పుడు మాత్రమే ప్రెసిడెంట్‌ రూల్‌ విధించాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఒకవేళ ఇప్పుడు అలా చేస్తే.. అది రాజకీయ ప్రతీకారమేనని తేలిపోతుందన్నారు. మరో కోణంలో చూస్తే.. విపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఇదో ఫార్ములా అని భావించాలన్నారు.

ఇది కూడా చదవండి: Anupama: తన పోస్టర్‌పై బూతు కామెంట్లు.. టిల్లు స్క్వేర్ ఈవెంట్‌కి ముఖం చాటేసిన అనుపమ!

ఇదిలా ఉంటే అరెస్ట్, ఈడీ కస్టడీపై కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం న్యాయస్థానం విచారించి ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. గురువారం కస్టడీ ముగిసిన తర్వాత కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు ఇదే కేసులో గోవా ఆప్ లీడర్లకు కూడా ఈడీ తాజాగా సమన్లు అందించింది. గురువారం విచారణకు హాజరుకావాలని తెలిపింది.

ఇది కూడా చదవండి: Maldives: మాల్దీవుల్లో తాగునీటి కష్టాలు.. టిబెట్‌ సాయం