Leading News Portal in Telugu

Off The Record : అడవిలో అలజడి.. ఆదివాసీలు vs లంబాడాలు



Tribal Otr

అడవిలో అలజడి మొదలవుతోందా? పొలిటికల్‌ పార్టీలకు చుక్కలు కనిపించబోతున్నాయా? ఆదివాసీ వర్సెస్‌ లంబాడా పోరులో రాజకీయ పార్టీలు నలిగిపోతున్నాయా? టిక్కెట్‌ ఇవ్వకుంటే మా తడాఖా ఏంటో చూపిస్తామంటూ… ఒక వర్గం తొడగొడుతోందా? ఇంతకీ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో లంబాడాల బాధేంటీ.. ఆదివాసీల డిమాండ్‌ ఏంటి? పొలిటికల్‌ వార్‌ ఎలా మారబోతోంది? ఆదిలాబాద్ లోక్ సభ స్థానం ఎస్టీ రిజర్వ్‌డ్‌ కాగా ఇక్కడ మెజార్టీ పార్టీలు ఆదివాసీలకే టిక్కెట్‌ ఇచ్చాయి. దీంతో లంబాడా వర్గం కన్నెర్రజేస్తోంది. ఓటర్లుగా మేమే ఎక్కువ ఉన్నాం… గెలుపు ఓటములను ప్రభావితం చేసే సామర్థ్యం మాకే ఉందని భావిస్తున్న లంబడాలు సోషల్ మీడియా వేదికగా పోరు మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ప్రకటనను కూడా చూశాక కార్యాచరణ సిద్ధం చేయాలనుకుంటున్నట్టు తెలిసింది. ఛలో ఆదిలాబాద్… బంజారా గర్జన పేరుతో సత్తా చాటాలనుకుంటున్నారట. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కలు చెబుతూ ఇదిగో మా బలం అంటూ ప్రచారంలో పెడుతున్నారు లంబాడాలు. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఎస్టీ ఓటర్లు 3 లక్షల 55 వేల 863 మంది ఉండగా… అందులో లక్షా 48 వేల 264 లంబాడా ఓట్లు. వివిధ ఆదివాసీ తెగలు కలిపి 2లక్షల 7వేల 599 మంది ఉన్నారు. 9 తెగలు కలిస్తే మాకంటే ఎక్కువగా ఉన్నారని, కీలకమైన గోండులు మాత్రం తక్కువగానే ఉన్నారు కాబట్టి బలం మాదేనన్నది లంబాడాల లెక్కగా తెలిసింది.

ఇప్పటికే బీఆర్ఎస్ ఆదివాసీ అయిన ఆత్రం సక్కుకు టికెట్ ఖరారు చేయగా బీజేపీ బీఆర్ఎస్ నుంచి మారిన మాజీ ఎంపీ నగేష్‌ను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ టికెట్ ఇవ్వాల్సి ఉండగా లంబడాలకే ఇవ్వాలనే పట్టుబడుతున్నట్టు తెలిసింది. పార్టీ ఏదైనా సరే లంబడాలను విస్మరిస్తే ఊరుకోబోమని బంజార సంఘం అల్టిమేటం ఇచ్చేసింది. నిర్మల్ , ముథోల్ నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఆపార్టీ నేతలకు బంజారాల నుంచి నిరసన సెగలు తగులుతున్నట్టు తెలిసింది. ముథోల్ ,నిర్మల్ నియోజకవర్గాల్లో ఆదివాసీల కంటే లంబడాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అటు కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్‌ కోసం పోటీ పడుతున్నవారిలో లంబాడాలే ఎక్కువగా ఉన్నారు. కానీ… పార్టీ అగ్ర నాయకత్వం ఆదివాసీ మహిళకు ఇవ్వాలన్న ఉద్దేశ్యంలో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంతో లంబాడా నేతలంతా అలర్ట్‌ అయ్యారట. టికెట్ ఆశిస్తున్న రేఖానాయక్ ,నరేష్ జాదవ్ ,ఇతర నాయక్ లంతా అదిష్టానంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. అదే సమయంలో పార్టీలు వేరైనా మనమంతా ఐక్యంగా ఉండి పోరాడాలంటూ కొంతమంది తెరవెనక ప్రయత్నాలు మొదలెట్టారట. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేయాలని లంబాడాలు అనుకుంటున్నట్టు తెలిసింది. కుదిరితే ఇండిపెండెంట్‌గా లేదంటే బీఎస్పీనో మరే ఇతర పార్టీ తరపునో తమ అభ్యర్థిని నిలబెట్టి మిగతా పార్టీలకు ఓట్లద్వారా తమ సత్తాచూపించాలని భావిస్తున్నారట. మొత్తంగా ఆదివాసీ వర్సెస్‌ లంబాడా పోరు ఆదిలాబాద్‌లో రాజకీయ పార్టీలకు సంకటంగా మారిందంటున్నారు పరిశీలకులు.